వివాహిత మృతిపై ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-05-25T05:14:02+05:30 IST
నీలావతి గ్రామానికి చెందిన వివాహిత బూరాడ మాధవి (28) మృతిపై ఫిర్యాదు అందినట్టు ఎస్‌ఐ బుద్దల గణేష్ తెలిపారు.

గంట్యాడ : నీలావతి గ్రామానికి చెందిన వివాహిత బూరాడ మాధవి (28) మృతిపై ఫిర్యాదు అందినట్టు ఎస్‌ఐ బుద్దల గణేష్ తెలిపారు. ఈ మేరకు సోమ వారం ఆయన తెలిపిన వివరాల మేరకు... నీలావతికి చెందిన గుల్లుపల్లి వాసుతో రెండేళ్ల కిందట విజయనగరం పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన మాధవికి వివాహమైంది. ప్రస్తుతం మాధవి రెండు నెలలు గర్భిణి. ఆదివారం కడుపునొప్పి రావడంతో విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆమెను తరలించారు. అక్కడ చికిత్స అందించిన వైద్యులు, ఆమె పరిస్థితి విషయమించిందని, ఇక్కడ నుంచి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో మాధవిని ఘోషాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు అక్కడి వైద్యులు తెలిపారు. అయితే మాధవి మృతిపై ఆమె భర్త వాసు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రైవేట్ ఆసుపత్రిలో అందించిన చికిత్సపై గంట్యాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐ గణేష్, తహసీల్దార్ స్వర్ణకుమార్ మాధవి మృతదేహాన్ని పరిశీలించారు. శవపంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. వాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య
సాలూరు : పట్టాణానికి చెందిన వివాహిత జర్జాపు శ్యామల (28) కడుపు నొప్పి తాళలేక చీమల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలు ప్రకారం... స్థానిక బోనువీధికి చెందిన జర్జాపు శ్యామల ఆదివారం అర్ధరాత్రి కడుపునొప్పి తాళలేక చీమల మందు తాగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె భర్త శంకరరావు, కుటుంబ సభ్యులు సమీపంలో ఆసుపత్రికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. కాగా 14 ఏళ్ల కిందట శంకరరావుతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏఎస్‌ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.