ఒత్తిడికి తాళలేక..

ABN , First Publish Date - 2021-10-15T04:53:52+05:30 IST

తల్లి, తమ్ముడిని బాగా చూసుకోవాలన్న ఆలోచనతో ఆ యువకుడు ఓ ప్రైవేటు కంపెనీలో రూ.30 వేలు డిపాజిట్‌ చేసి చేరాడు. చదువుకుంటూనే కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. కంపెనీ ప్రతినిధులు టార్గెట్‌ పెంచుతూ నిత్యం ఒత్తిడి తెస్తుండడంతో తట్టుకోలేక ఉద్యోగం మానేయాలని భావించి డిపాజిట్‌ డబ్బులు అడిగాడు. వారు ఇచ్చేది లేదనడంతో విషయం తల్లికి తెలిస్తే ఏమంటుందోనని ఆందోళన చెందాడు.

ఒత్తిడికి తాళలేక..
కేశవ శ్రీనివాసరావు (ఫైల్‌)

విద్యార్థి ఆత్మహత్య

సాలూరు, అక్టోబరు 14: తల్లి, తమ్ముడిని బాగా చూసుకోవాలన్న ఆలోచనతో ఆ యువకుడు ఓ ప్రైవేటు కంపెనీలో రూ.30 వేలు డిపాజిట్‌ చేసి చేరాడు. చదువుకుంటూనే కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. కంపెనీ ప్రతినిధులు టార్గెట్‌ పెంచుతూ నిత్యం ఒత్తిడి తెస్తుండడంతో తట్టుకోలేక ఉద్యోగం మానేయాలని భావించి డిపాజిట్‌ డబ్బులు అడిగాడు. వారు ఇచ్చేది లేదనడంతో విషయం తల్లికి తెలిస్తే ఏమంటుందోనని ఆందోళన చెందాడు. అదే ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడు. సాలూరు పట్టణానికి చెందిన గుల్లిపల్లి కేశవ శ్రీనివాసరావు(20) విషాదాంతమిది. తల్లి విశాలక్షి, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సాలూరు పట్టణంలోని పెద్దకుమ్మరివీధిలో నివాసం ఉంటున్న గుల్లిపల్లి విశాలక్షికి భర్త లేడు. తను కష్టపడి పనిచేస్తూ ఇద్దరు కుమారులను పోషించుకుంటోంది. పెద్ద కుమారుడు కేశవ శ్రీనివాసరావు హైదరాబాద్‌ బిట్స్‌ పిలానీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా... రెండో కుమారుడు 8వ తరగతి చదువుతున్నాడు. ఉద్యోగం చేసి అమ్మకు ఎంతో కొంత ఆసరాగా ఉండాలని భావించిన శ్రీనివాసరావు ఇటీవలే ఓ ప్రైవేటు ఆనలైన మార్కెటింగ్‌ కంపెనీలో వర్క్‌ ఫ్రం హోం పద్ధతిలో చేరాడు. అందుకోసం రూ.30 వేలు డిపాజిట్‌ చేశాడు. కంపెనీ ప్రతినిధులు విధించిన లక్ష్యాన్ని (టార్గెట్‌) చేరుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకుని డిపాజిట్‌ డబ్బులు అడిగాడు. కంపెనీ ప్రతినిధులు అంగీకరించకపోవడంతో ఈ విషయం తల్లికి తెలిస్తే ఏమంటుందోనని భయపడ్డాడు. మరింత టెన్షనకు గురై గురువారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయాడు. తన కొడుకు చాలా తెలివైన వాడని, భవిష్యతలో ఆసరాగా ఉంటాడని ఆశ పడ్డానని, అంతలోనే దారుణం జరిగిపోయిందని తల్లి విశాలాక్షి విలపిస్తోంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కావటం లేదు. పట్టణ ఎస్‌ఐ ఫకృద్దీన్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. Updated Date - 2021-10-15T04:53:52+05:30 IST