గంజాయి వయా మెంటాడ

ABN , First Publish Date - 2021-11-29T04:14:55+05:30 IST

గంజాయి స్మగ్లింగ్‌కు అరకు- మెంటాడ రోడ్డు అడ్డాగా మారుతోంది. రవాణాదారులు వ్యూహం మార్చారు. కొత్తగా ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. మెంటాడ మండలంలో గత నెల రోజుల వ్యవధిలో నాలుగుసార్లు గంజాయి పట్టుబడడం స్థానికంగా కలకలం రేగుతోంది.

గంజాయి వయా మెంటాడ
పోలీసులు స్వాధీన పరుచుకున్న గంజాయి(ఫైల్‌)

తరలింపునకు మార్గంగా ఎంచుకుంటున్న స్మగ్లర్లు

20 రోజుల్లో వెయ్యి కిలోలు పట్టివేత 

గతంలోనూ పెద్దఎత్తున రవాణా

ఇన్ఫార్మర్ల సమాచారంతో పక్కాగా పోలీసుల నిఘా


గంజాయి స్మగ్లింగ్‌కు అరకు- మెంటాడ రోడ్డు అడ్డాగా మారుతోంది. రవాణాదారులు వ్యూహం మార్చారు. కొత్తగా ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. మెంటాడ మండలంలో గత నెల రోజుల వ్యవధిలో నాలుగుసార్లు గంజాయి పట్టుబడడం స్థానికంగా కలకలం రేగుతోంది. 20 రోజుల్లో వెయ్యి కిలోలు పట్టుబడింది. ఇన్ఫార్మర్ల సమాచారంతో పోలీసులు పక్కాగా నిఘా పెట్టి కనిపెడుతున్నారు. 


మెంటాడ, నవంబరు 28: 

సాధారణ పంటలకు తీసిపోని విధంగా గంజాయిని సాగు చేస్తున్న విశాఖ జిల్లా అరకు ప్రాంతానికి మెంటాడకు మధ్య దూరం కేవలం 70 కిలోమీటర్ల లోపే. రహదారి సౌకర్యం అంతంతమాత్రంగా ఉండడంవల్ల రాకపోకలు తక్కువగా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే అరకుకు మెంటాడ సరిహద్దు ప్రాంతంగా ఉంది. అరకు-మెంటాడ మధ్యనున్న భూభాగమంతా దట్టమైన అటవీప్రాంతమే. మెరుగైన రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల ఈ మండలం మీదుగా గంజాయి తరలిస్తే ఎవరికీ అనుమానం రాదని స్మగ్లర్లు వ్యూహం పన్నుతున్నారు. అరకు నుంచి ఇతర ప్రాంతాల మీదుగా గంజాయి రవాణా చేయడం తరచూ వింటున్నాం. మెంటాడ మీదుగా స్మగ్లింగ్‌ చేయడం కొత్త పథకమే. గత 20రోజుల్లో నాలుగు సార్లు పట్టుబడిన గంజాయి వెయ్యికిలోల పైమాటే. దీనివిలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. తొలిసారిగా ఈ మండలంలో గంజాయి పట్టుబడినపుడు మండలంమొత్తం అవాక్కయింది. ఈ ప్రాంతం మీదుగా రవాణా ఎలా సాధ్యమవుతోందని ఒకటే చర్చలు జరిగాయి. వరుసుగా నాలుగుసార్లు పట్టుబడడంతో ప్రజలు నేడు తేలిగ్గా తీసుకుంటున్నారు. పైగా రాష్ట్రంలో ప్రతిరోజూ ఎక్కడోచోట గంజాయి ఘాటు బయటపడుతుండడంతో స్థానికులు పట్టించుకోవడం మానేశారు. కానీ కొన్ని ప్రశ్నలు, ఇంకొన్ని అనుమానాలు మాత్రం అందరినీ వెంటాడుతున్నాయి. ఇదివరకు కూడా ఈ ప్రాంతంమీదగా గంజాయి విచ్చలవిడిగా రవాణా జరిగేవుండేదని, అప్పటి పోలీసుసిబ్బంది బహూశా దీన్ని తేలిగ్గా తీసుకోవడమో లేదా తెరవెనుక మరో వ్యవహారం నడిచిందనో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత ఎస్‌ఐ సుదర్శన్‌ ఆధ్వర్యంలో సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉన్నారు. గంజాయి రవాణాదారులు ఏ వ్యూహం పన్నినా పట్టుకుంటున్నారు. అరకు నుంచి ఎస్‌.కోట మీదుగా విశాఖకు తరలించాలంటే నాలుగు చెక్‌ పోస్టులు దాటాలి. అందుకే స్మగ్లర్లు దారి మార్చారు. పిట్టాడలో ఏర్పాటు చెందిన చెక్‌ పోస్ట్‌ మినహా అనంతగిరి మండలం తుమ్మన్నవలస నుంచి గజపతినగరం వరకు ఎక్కడా చెక్‌పోస్ట్‌లేకపోవడంతో స్మగ్లర్లు ఈ రూట్‌ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు మాత్రం పంజా విసురుతున్నారు. గట్టి నిఘా పెడుతున్నారు. సమాచారం అందిన వెంటనే నలువైపులా తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీల్లో గంజాయి పట్టుబడుతున్నప్పటికీ వాహనాల సీజ్‌, నిందితుల అరెస్టు వంటివి జరుగుతున్నా స్మగ్లర్లు వెనక్కి తగ్గకపోవడం చర్చనీయాంశమవుతోంది. గంజాయి రవాణా కేసుల్లో జార్ఖండ్‌, ఒడిశాకు చెందిన వారు ఎక్కువగా పట్టుబడుతున్నారు. అరకు, అనంతగిరికి చెందిన గిరిజనులు కూడా ఇరుక్కు పోతున్నారు. ఏదేమైనప్పటికీ మెంటాడ మండలం మీదుగా గంజాయి రవాణా జరగడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.  


Updated Date - 2021-11-29T04:14:55+05:30 IST