ఆ పట్టాలు రద్దు చేయండి

ABN , First Publish Date - 2021-10-29T04:36:43+05:30 IST

ఇళ్ల నిర్మాణాలపై ఆసక్తి లేని వారి పట్టాలను రద్దు చేసి మిగతా అర్హులకు వాటిని అందజేయాలని కలెక్టర్‌ సూర్యకుమారి ఆదేశించారు. పేదల ఇళ్లపై కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు.

ఆ పట్టాలు రద్దు చేయండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ సూర్యకుమారి

ఆసక్తి లేని వారిని పక్కన పెట్టండి

పేదలంతా ఇళ్లు నిర్మించుకోవాల్సిందే

కలెక్టర్‌ సూర్యకుమారి 

కలెక్టరేట్‌, అక్టోబరు 28: 

ఇళ్ల నిర్మాణాలపై ఆసక్తి లేని వారి పట్టాలను రద్దు చేసి మిగతా అర్హులకు వాటిని అందజేయాలని కలెక్టర్‌ సూర్యకుమారి ఆదేశించారు. పేదల ఇళ్లపై కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో  వివిధ శాఖల అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గృహాల నిర్మాణానికి ముందుకు రాని పేదలకు తొలుత అవగాహన కల్పించాలని సూచించారు. ఎక్కడ ఇళ్లు కడితే అక్కడికి వెళ్లేలా చైతన్య పరచాలని... అప్పటికీ ఆసక్తి లేకుంటే వారి పట్టాలను రద్దు చేయాలని ఆదేశించారు. ఇష్టం ఉన్నవారితో ముందుగా నిర్మాణాలు చేపడితే మిగిలిన వారిలో చైతన్యం వస్తుందని చెప్పారు. జగనన్న కాలనీల్లో విద్యుత్‌, నీటి సరఫరా, బోర్‌ వెల్స్‌ తదితర మౌలిక సదుపాయాలపై అవగాహన కల్పించాలన్నారు. వారంలోగా జియో ట్యాగింగ్‌, క్లస్టర్‌ మ్యాపింగ్‌, రిజిసే్ట్రషన్లు పూర్తి కావాలని సూచించారు. క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి తలెత్తే సమస్యలపై ముందుగా దృష్టి పెట్టాలన్నారు. డబుల్‌ ఎంట్రీలు, డేటా బేస్‌, నాట్‌ విల్లింగ్‌ తదితర రిమార్క్‌లను రాసి ముందుగా అప్‌లోడ్‌ పూర్తి చేయాలన్నారు. సాలూరు మున్సిపాలిటీలో ఇళ్ల నిర్మాణాలు తక్కువగా ప్రారంభమవడంపై కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

వచ్చే నెల 25 నాటికి టిడ్కో గృహాలు 

డిసెంబరు నెలలో టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం భావిస్తున్నందున నవంబర్‌ 25 నాటికే గృహాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. మొదటి దశలో అందజేసే గృహాలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.

సామాన్యులకు రుణాలివ్వండి 

సామాన్య ప్రజలకు మరింత సులువుగా రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు ముందుకు రావాలని కలెక్టర్‌ సూర్యకుమారి కోరారు. రుణమేళాను ఆమె గురువారం విజయనగరంలో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రుణం తీసుకునే విధానం, బ్యాంకు కార్యకలాపాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ బ్యాంకులతో ముడిపడి ఉన్నాయని, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే బ్యాంకుల సహకారం అవసరమని చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ డీజీఎం (అమరావతి) ఎ.వెంకటరామయ్య, ఎల్‌డీఎం శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు వివిధ పథకాల ద్వారా మంజూరైన 139.52 కోట్ల రుణాలను కలెక్టర్‌ అందజేశారు.



Updated Date - 2021-10-29T04:36:43+05:30 IST