‘పంచాయతీ’కి బ్రేక్‌!

ABN , First Publish Date - 2021-01-12T05:50:14+05:30 IST

పంచాయతీ ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది.

‘పంచాయతీ’కి బ్రేక్‌!

ఊపిరి పీల్చుకుంటున్న అధికారులు.. ప్రజా ప్రతినిధులు
సంక్షేమ పథకాల పంపిణీకి తొలగిన అడ్డంకులు
పంచాయతీ ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. నాలుగు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల కమిషన్‌ షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచీ ఓవైపు ఎన్నికల సందడి...మరోవైపు పండగ హడావుడి తో గ్రామాల్లో వాతావరణం వేడెక్కింది. రాజకీయ సమావేశాలు మొదలయ్యాయి. సమీకరణాలపై చర్చలు సాగాయి. ఆశావహులు పోటీకి గల అవకాశాలపై సన్నిహితులతో చర్చిస్తున్నారు. మరోవైపు అంతా కోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  షెడ్యూలును రద్దు చేస్తూ కోర్టు తీర్పునివ్వడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఏకపక్షంగా ఎన్నికలను ప్రకటించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఓవైపు ఎన్నికల షెడ్యూలు...మరోవైపు పథకాల అమలు బాధ్యత... ఈ నేపథ్యంలో ఏంచేయాలో తెలియక అధికార యంత్రాంగం సతమతమవుతోంది. ఎన్నికల షెడ్యూల్‌కు బ్రేక్‌ పడడంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంకోవైపు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఇళ్ల స్థలాలు, అమ్మఒడి తదితర సంక్షేమ పథకాల కొనసాగింపునకు అడ్డంకులు తొలిగాయి. ఎన్నికల సంఘం ఈనెల 8న గ్రామ పంచాయతీ   సంగ్రామానికి షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల 9నుంచే ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనేందుకు సందిగ్ధావస్థలో పడ్డారు. కోర్టు తీర్పుతో వారంతా యధావిధిగా తమ కార్యక్రమాలు కొనసాగించేందుకు వీలు కలిగింది. కోడ్‌ అమలు విషయంలో అధికారులు ఇరకాటంలో పడ్డారు. సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలా? అడ్డుకోవాలా? ఉల్లంఘనల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? అనే విషయంలో మల్లగుల్లాలు పడ్డారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఇతర కార్యక్రమాలపై దృష్టి పెట్టేందుకు వీలు కలిగింది.
ఆశావహులకు నిరాశ
ఇదిలా ఉండగా ఎన్నికల షెడ్యూలు ప్రకటనతో రాజకీయ నాయకుల్లో కదలిక వచ్చింది. ఇప్పటికే పోటీకి సిద్ధపడిన  వారు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.  ఓవైపు కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తూనే.. మరోవైపు గ్రామాల్లో తమ అనుయాయులతో ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఇటు పండగ సందడి...అటు ఎన్నికల హడావుడి మొదలైంది. కోర్టు తీర్పును అనుసరించి ముందుకు వెళ్లాలని అధికశాతం ఆలోచించారు. ఈమేరకు షెడ్యూలుకు కోర్టుకు బ్రేకు వేయడంతో ఆశావహులు నిరాశకు గురవుతున్నారు.

Updated Date - 2021-01-12T05:50:14+05:30 IST