ఉత్సాహంగా భోగి

ABN , First Publish Date - 2021-01-14T05:14:35+05:30 IST

మూడు రోజుల పండుగ సంబరం ఉత్సాహంగా మొదలైంది. వాడవాడలా భోగి మంటలు వేస్తూ బుధవారం ప్రజలంతా సందడి చేశారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి భోగి మంటలు వేయడం ప్రారంభించారు. సాంప్రదాయ బద్ధంగా ఆవుపేడతో తయారు చేసిన పిడకలను చాలాచోట్ల వాడడం కనిపించింది.

ఉత్సాహంగా భోగి

నేడు సంక్రాంతి 

పల్లెకు పండగ కళ

వెళ్లివిరుస్తున్న సంప్రదాయాలు

విజయనగరం (ఆంధ్రజ్యోతి)/ సాలూరు రూరల్‌, జనవరి 13:

మూడు రోజుల పండుగ సంబరం ఉత్సాహంగా మొదలైంది. వాడవాడలా భోగి మంటలు వేస్తూ బుధవారం ప్రజలంతా సందడి చేశారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి భోగి మంటలు వేయడం ప్రారంభించారు. సాంప్రదాయ బద్ధంగా ఆవుపేడతో తయారు చేసిన పిడకలను చాలాచోట్ల వాడడం కనిపించింది. కాలనీలు, అపార్ట్‌మెంట్‌లలో నివసించే వారంతా సముదాయాల వద్దే భోగి వేసుకుని ఆనందంగా గడిపారు. యువతీ, యువకులు నృత్యాలు చేశారు. భోగి నుంచి వచ్చాక ఉదయానే నువ్వుల నూనె ఒంటికి పట్టించి, శనగపిండితో నలుగు పెట్టుకుని స్నానమాచరించారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు తన నివాసంలో భోగి మంట వేశారు. ఇదే రోజు వేంకటేశ్వర, రామాలయాల్లో గోదాదేవి కల్యాణం కమనీయంగా జరిగింది. సాలూరులోని పెదకోమటిపేట రామాలయంలో గోదాదేవి కల్యాణం వైభవంగా జరిగింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేషంగా అలంకరించారు. అలాగే ఇళ్లలో చిన్నారులపై భోగి పండ్లు వేస్తూ పెద్దలు దీవెనలు అందించారు. యువతులు ముంగిళ్లను రంగవల్లులతో అలంకరించి వాటిలో గొబ్బెమ్మలు పెట్టారు. మేలుకొలుపు కార్యక్రమం బుధవారంతో ముగిసింది. మరోవైపు బంధువులు, కొత్త అళ్లుళ్లతో అందరింటా సందడే సందడి నెలకొంది. అసలు పండగకు వేళ అయింది. 

హిందూ సాంప్రదాయంలో సంక్రాంతికి ఎంతో ప్రాధాన్యం ఉంది. పండుగ రోజు తాత, ముత్తాతలకు పూజలు చేయడం ఆనవాయితీ. వీరితో పాటు ఆ కుటుంబంలో మరణించిన వారికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి, నూతన వసా్త్రలు సమర్పిస్తారు. ఆ తర్వాతే తాము కూడా ధరిస్తారు. ఇక ఇళ్లకూ పండగ కళ వచ్చింది. విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించారు. మూడు రోజుల పండుగలో భాగంగా తొలి రోజు భోగిని నిర్వహించుకున్న ప్రజలు గురువారం సంక్రాంతిని, శుక్రవారం కనుమ పండుగను జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో కావాల్సిన పూజా సామగ్రి, ఇతర నిత్యావసరాలు, పూలు, పండ్లు, స్వీట్లను కొనుగోలు చేసేందుకు అధిక సంఖ్యలో విజయ నగరం మార్కెట్‌కు బుధవారం తరలివచ్చారు. పార్వతీపురం, బొబ్బిలి. సాలూరు, ఎస్‌.కోట, గజపతినగరంతోపాటు వివిధ ప్రాంతాల్లో వున్న మార్కెట్‌ కూడళ్లు కూడా కిటకిటలాడుతూ కన్పించాయి. 


Updated Date - 2021-01-14T05:14:35+05:30 IST