రేషన్‌కు వెనుకంజ

ABN , First Publish Date - 2021-05-03T05:29:50+05:30 IST

ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉచిత రేషన్‌ సరుకులు తీసుకునేందుకు కార్డుదారులు వెనుకంజ వేస్తున్నారు. కరోనా ఉధృతి పరిస్థితిలో సరుకులు పొందడానికి భయపడుతున్నారు. ఈపాస్‌ మిషన్‌పై వేలిముద్రలు వేసి సరుకులు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఒకటి.. రెండు చోట్ల కాదు జిల్లా అంతా ఇదే పరిస్థితి కన్పిస్తోంది.

రేషన్‌కు వెనుకంజ

కొవిడ్‌పై కార్డుదారుల్లో కలవరం 

కలెక్టరేట్‌, మే 2: ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉచిత రేషన్‌ సరుకులు తీసుకునేందుకు కార్డుదారులు వెనుకంజ వేస్తున్నారు. కరోనా ఉధృతి పరిస్థితిలో సరుకులు పొందడానికి భయపడుతున్నారు. ఈపాస్‌ మిషన్‌పై వేలిముద్రలు వేసి సరుకులు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఒకటి.. రెండు చోట్ల కాదు జిల్లా అంతా ఇదే పరిస్థితి కన్పిస్తోంది. 

ఈనెల మొదటి నుంచే ఉచిత రేషన్‌ సరుకుల పంపిణీ మొదలు పెట్టారు. వాహనాల ద్వారా ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. మే, జూన్‌ నెలలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రేషన్‌ కార్డుదారులకు డబుల్‌ రేషన్‌ ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికీ ఐదుకిలోలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒక్కొక్కరికీ ఇచ్చే ఐదు కిలోలు కలిపి మొత్తం 10 కిలోలు అందజేస్తున్నారు. వలంటీరు సమక్షంలో  కార్డుదారుడి వేలిముద్రలు తీసుకుని సరుకులు సరఫరా చేస్తున్నారు. కొవిడ్‌ కారణంగా కార్డుదారులు ముందుకు రావడం లేదు. వైరస్‌ ప్రబలుతుందేమోనని భయపడుతున్నారు. ఇప్పటివరకూ ఈ రెండు రోజుల్లో 35 వేల మంది కార్డుదారులకు మాత్రమే సరుకులు అందించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ విడతలో బయోమెట్రిక్‌ మిషన్‌ ద్వారా కాకుండా నేరుగా సరుకులు ఇస్తే బాగుంటుందని కార్డుదారులు వాపోతున్నారు. ఇదే విషయమై జిల్లా పౌర సరఫరాల అధికారి పాపారావు వద్ద ప్రస్తావించగా కొవిడ్‌ నిబంధనలు అనుసరించి సరుకులు సరఫరా చేస్తున్నామని, వాహనదారులకు శానిటైజర్లు, మాస్క్‌లు సరఫరా చేశామన్నారు.  ఇప్పటి వరకూ 35 వేల మంది కార్డుదారులకు సరుకులు ఇచ్చామని, ఈనెల 21 తేదీ వరకూ సరుకులు ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని వెల్లడించారు. 


Updated Date - 2021-05-03T05:29:50+05:30 IST