మహిళల్లో చైతన్యం

ABN , First Publish Date - 2021-12-31T04:30:29+05:30 IST

జిల్లా మహిళల్లో చైతన్యం పెరిగిందని, ఏ సమస్య వచ్చినా, దాడి జరిగినా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తున్నారని ఎస్పీ దీపికాపాటిల్‌ చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ఏడాదిలో జరిగిన నేరాల సమాచారాన్ని వెల్లడించారు.

మహిళల్లో చైతన్యం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ దీపికా పాటిల్‌

ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తున్నారు

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు: ఎస్పీ

విజయనగరం క్రైం, డిసెంబరు 30: జిల్లా మహిళల్లో చైతన్యం పెరిగిందని, ఏ సమస్య వచ్చినా, దాడి జరిగినా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తున్నారని ఎస్పీ దీపికాపాటిల్‌ చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ఏడాదిలో జరిగిన నేరాల సమాచారాన్ని వెల్లడించారు. మహిళలకు సంబంధించిన నేరాలు పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టాయన్నారు. దిశ యాప్‌ను వినియోగించడంలో కూడా అవగాహన పెరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ నేరాల కింద ఈ ఏడాదిలో 9,136 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఆస్తికి సంబంధించి 471 కేసులు నమోదు కాగా వాటిలో 62 శాతం ఛేదించి విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జూదం ఆడుతున్న వారిపై 20 కేసులు, కోడి పందాలపై 60 కేసులు నమోదు చేసినట్టు  వెల్లడించారు. గుట్కా తరలిస్తున్న వారిపై 146 కేసులు, గంజాయి రవాణాపై 49 కేసులు నమోదు చేశామన్నారు. గంజాయి రవాణాలో 61 మందిని అరెస్టు చేసి వారు వినియోగించిన 34 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందులో 12,863 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మద్యం, నాటుసారా తరలించేందుకు వినియోగించిన 268 వాహనాలను సీజ్‌ చేశామని, స్వాధీనం చేసుకున్న 6,011 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశామని తెలిపారు. ఈ ఏడాదిలో 850 రోడ్డు ప్రమాదాలు జరగ్గా... వాటిలో 281 మంది మృతి చెందారని, 1191 మంది క్షతగాత్రులయ్యారని వివరించారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న పూసపాటిరేగ, విజయనగరం ట్రాఫిక్‌, బొండపల్లి, డెంకాడ, భోగాపురం పోలీసు స్టేషనలను గుర్తించి... నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. బాలకార్మికులుగా పనిచేస్తున్న 165 మందిని ఆపరేషన ముష్కానలో గుర్తించి వారు తిరిగి చదువుకునేలా చర్యలు చేపట్టామని ఎస్పీ చెప్పారు. సమావేశంలో ఏఎస్పీ శ్రీదేవిరావు, ఓఎస్‌డీ సూర్యచంద్రరావు, ఏఎస్‌పీ సత్యనారాయణరావు, డీఎస్పీ అనిల్‌కుమార్‌, సీఐలు రాంబాబు, శ్రీనివాసరావు, రుద్రశేఖర్‌, మురళీ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-31T04:30:29+05:30 IST