కొలత..కలత!

ABN , First Publish Date - 2021-12-26T05:26:16+05:30 IST

ఓవైపు పెట్రోలు కల్తీ ... మరోవైపు కొలతల్లో తేడాలు...అంతేకాకుండా కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం...ఇదీ జిల్లాలోని అధిక శాతం పెట్రోలు బంకుల్లో పరిస్థితి. ఎక్కడా నిబంధనలు పాటించిన దాఖలాలు కనిపించవు. త్వరగా గమ్యం చేరాలనే వినియోగదారుడి ఆరాటం...అవగాహన లోపం... బంకుల యాజమాన్యాలకు కలసివస్తోంది. ఇదే కల్తీకి...నిబంధనలు పాటించకపోవడానికి ఊతమిస్తోంది.

కొలత..కలత!
భోగాపురంలోని ఓ బంకులో పంపును సీజ్‌ చేస్తున్న అధికారులు

ఓ వైపు కల్తీ...మరోవైపు కొలతల్లో తేడాలు

వేయింగ్‌ మిషన్ల టాంపరింగ్‌తో మోసం

ఇష్టారాజ్యంగా పెట్రోల్‌ బంకుల నిర్వహణ

ధనార్జనే ధ్యేయం

కానరాని సౌకర్యాలు, సేవలు

మంచినీటి సౌకర్యం లేని బంకులెన్నో

అధికారుల తూతూమంత్రపు తనిఖీలు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి/భోగాపురం)

ఓవైపు పెట్రోలు కల్తీ ... మరోవైపు కొలతల్లో తేడాలు...అంతేకాకుండా కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం...ఇదీ జిల్లాలోని అధిక శాతం పెట్రోలు బంకుల్లో పరిస్థితి. ఎక్కడా నిబంధనలు పాటించిన దాఖలాలు కనిపించవు. త్వరగా గమ్యం చేరాలనే వినియోగదారుడి ఆరాటం...అవగాహన లోపం... బంకుల యాజమాన్యాలకు కలసివస్తోంది. ఇదే కల్తీకి...నిబంధనలు పాటించకపోవడానికి ఊతమిస్తోంది. ముఖ్యంగా పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాల్లో ఎక్కువగా మోసం జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 120 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. రోజుకు సగటున 2లక్షల లీటర్ల పెట్రోల్‌, 3.2 లక్షల లీటర్ల డీజిల్‌ విక్రయాలు జరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో 16వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్‌ బంకుల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో హైవే వెంబడి దాదాపు 15 బంకులు ఉన్నాయి. ఇందులో నిబంధనలు పాటించేవి కొన్ని మాత్రమే. వినియోగదారులకు కనీస సౌకర్యాలు ఉండవు. కనీసం గాలి కొట్టే యంత్రం బంకుల వద్ద కనిపించదు. 

అంతా మోసం

 కొన్ని పెట్రోల్‌ బంకుల యాజమాన్యాలు ఎలక్ర్టికల్‌ వేయింగ్‌ మిషన్లను ట్యాంపరింగ్‌ చేస్తున్నాయి. లీటరు పెట్రోల్‌కు 100 నుంచి 200 మిల్లీలీటర్ల వరకూ పక్కదారి పట్టిస్తున్నాయి. బంకుల వద్ద కనీస నిబంధనలు పాటించడం లేదు. ఏరోజుకారోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ప్రదర్శించాల్సి ఉన్నా.. ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు.  కొన్ని బంకుల్లో కల్తీ జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కానీ చర్యలు శూన్యం. వందలాది బంకులు ఉన్న జిల్లాలో ఈ ఏడాది కేవలం 17 కేసులు మాత్రమే నమోదయ్యాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వాస్తవానికి పెట్రోల్‌ నాణ్యతను తెలుసుకునేందుకు బంకుల వద్ద ఫిల్టర్‌ పేపర్‌ టెస్ట్‌ అందుబాటులో ఉంచాలి. కానీ ఈ విషయం చాలామంది వినియోగదారులకు తెలియదు. ప్రస్తుతం లీటరు పెట్రోల్‌ ధర రూ.110కి చేరింది. డీజిల్‌ రూ.100కు చేరువవుతోంది. ఇదే సమయంలో కల్తీ, తూకాల్లో తేడాలతో వినియోగదారుడు కుదేలవుతున్నాడు. బంకులు అందుబాటులో లేనిచోట విడిగా విక్రయాల పేరిట భారీ దోపిడీ జరుగుతోంది. లీటరు పెట్రోల్‌కు రూ.120కుపైగా విక్రయిస్తున్నారు. పైగా కిరోసిన్‌ కలిపి అమ్మకాలు చేస్తున్నారు. దీంతో వాహనాల ఇంజన్లు పాడవుతున్నాయి. 

 తనిఖీల ఊసే లేదు

వాస్తవానికి ఏరోజుకారోజు బంకుల వద్ద పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ప్రదర్శించాలి. పెట్రోల్‌, డీజిల్‌లో నాణ్యత కొరవడితే ఏ అధికారికి ఫిర్యాదు చేయాలి? ఎవరిని సంప్రదించాలి? వంటి ఫోన్‌ నంబర్ల వివరాలు నోటీసు బోర్డులో ఉంచాలి. కానీ కొద్ది బంకుల్లోనే ఇటువంటివి పాటిస్తున్నారు. వాస్తవానికి తమ పరిధిలో ఉండే బంకులను తూనికలు, కొలతల శాఖ అధికారులతో పాటు స్థానిక రెవెన్యూ సిబ్బంది నిత్యం తనిఖీ చేయాలి. సంబంధిత ఆయిల్‌ కంపెనీ ప్రతినిధి సైతం సందర్శిస్తుండాలి. పెట్రోల్‌, డీజిల్‌ నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షిస్తుండాలి. కానీ ఇవేవీ జిల్లాలో జరగడం లేదు. అసలు తనిఖీలే ఉండవు. ఎక్కడైనా ఆరోపణలు వచ్చినా... వాహనదారుల నుంచి ఫిర్యాదులు వచ్చినా అధికారులు హడావుడి చేస్తున్నారు. తరువాత ఆ మాటే మరిచిపోతున్నారు. అసలు జిల్లాలో తూనికలు, కొలతల శాఖ ఒకటి ఉందన్న విషయమే తెలియడం లేదు. బయటకు సిబ్బంది కొరత అని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కానీ నెలనెలా మామూళ్లు అందడం వల్లనే చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  

 ఆరు రకాల సేవలు తప్పనిసరి

బంకుల వద్ద ఆరు రకాల సేవలు అందుబాటులో ఉండాలి. లేకుంటే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకోవచ్చు. వినియోగదారుడికి ఇబ్బందులు తలెత్తితే డీలర్‌షిప్‌ కూడా రద్దు చేసే అవకాశముంది. కానీ వినియోగదారులకు అవగాహన ఉండడం లేదు.

1.పెట్రోల్‌, డీజిల్‌ నాణ్యతను సరిచూసుకోవచ్చు. బంకుల వద్ద ఫిల్టర్‌ పేపర్‌ టెస్ట్‌ అందుబాటులో ఉంచాలి. ఆ పేపరుపై రెండు మూడు చుక్కలు పెట్రోల్‌ వేస్తే అది ఆవిరైపోతే నాణ్యత కలిగినదిగా గుర్తించవచ్చు. అదే మరకలుగా మిగిలిపోతే కల్తీ జరిగినట్టు నిర్థారించవచ్చు. 

2.సాధారణంగా పెట్రోల్‌ బంకులకు సమీపంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అటువంటి సమయంలో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అవసరం. అందుకే బంకుల వద్ద తప్పనిసరిగా ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు అందుబాటులో ఉంచాలి. 

3. అత్యవసర, అనారోగ్య సమయాల్లో సమాచారం అందించేందుకు బంకుల వద్ద ఫోన్‌ అందుబాటులో ఉంచాలి. అటువంటి పరిస్థితుల్లో వచ్చిన వారికి అన్నివిధాలా అండగా నిలవాలి. 

4. దూర ప్రాంత ప్రయాణికుల కోసం మరుగుదొడ్లు, స్నానపు గదులు అందుబాటులో ఉంచాలి. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంచేయాలి. ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా చూసుకునే బాధ్యత యాజమాన్యాలదే. 

5. దాహంతో వచ్చేవారికి తప్పకుండా నీరందించాలి. ఇందుకుగాను పరిశుభ్రమైన వాటర్‌ ఫిల్టర్‌ను ఏర్పాటు చేయాలి. వాహన చోదకుల దాహార్తిని తీర్చడమే కాకుండా నీరు తీసుకెళ్లేందుకు అవకాశమివ్వాలి. 

6.వాహనాలకు సంబంధించి టైర్లకు గాలిని ఉచితంగానే కొట్టాలి. ఇందుకు ఎటువంటి రుసుం తీసుకోకూడదు. 


నిబంధనలు పాటించాలి

పెట్రోల్‌ బంకులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నాం. యాజమాన్యాలు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. తాగునీరు, మరుగుదొడ్లు, ఉచితంగా గాలి వంటివి తప్పనసరిగా అందుబాటులో ఉంచాలి. తనిఖీ సమయంలో నిబంధనలు పాటించకపోతే నోటీసులిస్తున్నాం. వినియోగదారులకు ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఫిర్యాదు చేయాలి.

- పాపారావు, జిల్లా పౌరసరఫరాల అధికారి


ఎప్పటికపుడు దాడులు చేస్తున్నాం

తనిఖీలు, దాడులు ముమ్మరం చేశాం. ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నాం. పెట్రోల్‌, డీజిల్‌ కొలతల్లో తేడాలకు సంబంధించి ఈ ఏడాది 17 కేసులు నమోదుచేశాం. యాజమాన్యాలకు నోటీసులు సైతం అందించాం. ఎక్కడైనా అక్రమాలు జరిగితే బాధితులు వెంటనే ఫిర్యాదు చేయాలి. సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం

 జనార్దనరావు, డిప్యూటీ కమిషనర్‌, తూనికలు, కొలతల శాఖ



Updated Date - 2021-12-26T05:26:16+05:30 IST