యథేచ్ఛగా గుట్కా రవాణా
ABN , First Publish Date - 2021-10-25T06:04:25+05:30 IST
గుట్కా విక్రయం, వినియోగంపై నిషేధం ఉన్నా చాక్లెట్ కన్నా ఈజీగా జిల్లాలో దొరుకుతోంది. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో వీటి విక్రయాలు విరివిగా పెరిగిపోతున్నాయి. ఊరూరా.. వాడవాడలా అందుబాటులో ఉంటున్నాయి. చాలా దుకాణాల్లో గుట్టుగా విక్రయాలు జరుగుతున్నాయి. అధికారులు అప్పుడప్పుడు తనిఖీ చేసి వదిలేయడంతో అమ్మకాలు తగ్గడం లేదు.

జిల్లాలో తగ్గని విక్రయాలు
కొరవడిన అధికారుల నిఘా
వ్యసనంగా మార్చుకుంటున్న యువకులు
గుట్కా విక్రయం, వినియోగంపై నిషేధం ఉన్నా చాక్లెట్ కన్నా ఈజీగా జిల్లాలో దొరుకుతోంది. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో వీటి విక్రయాలు విరివిగా పెరిగిపోతున్నాయి. ఊరూరా.. వాడవాడలా అందుబాటులో ఉంటున్నాయి. చాలా దుకాణాల్లో గుట్టుగా విక్రయాలు జరుగుతున్నాయి. అధికారులు అప్పుడప్పుడు తనిఖీ చేసి వదిలేయడంతో అమ్మకాలు తగ్గడం లేదు.
గజపతినగరం/దత్తిరాజేరు, అక్టోబరు 24:
ప్రభుత్వం ఖైనీ, గుట్కాల అమ్మకాలను నిషేధించినా జిల్లాలో వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఒడిశాలో నిషేధం లేకపోవడంతో అక్కడి నుంచి రైళ్లు, లారీల ద్వారా జిల్లాకు చేరుతున్నాయి. గతంలో అధికారులు దాడులు చేస్తూ అమ్మకాలను నియంత్రించేవారు. అపరాధ రుసుంతో పాటు జైలు శిక్షలు పడడంతో కొంత మేర విక్రయాలు తగ్గేవి. అధికారులు నిర్లక్ష్యం చేయడంతో మళ్లీ అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా యువతకు గుట్కా ఓ వ్యసనంగా మారింది. చదువుకుంటున్న వారు సైతం అధికంగా వినియోగిస్తున్నారు. చుట్టు పక్కల స్నేహితులతో సరదాగా గుట్కా పాన్ మసాలాలను వేస్తూ తర్వాత అలవాటుగా మార్చుకుంటున్నారు. దీంతో కేన్సర్ వంటి భయంకరమైన వ్యాధులకు గురవుతున్నారు. గుట్కాలో ఉండే మత్తు పదార్థాలు మనిషిని పూర్తిగా బానిసను చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. వాటిని ఒక్కసారి కూడా వినియోగించవద్దని కోరుతున్నారు. పేదవారు.. అందులోనూ కూలి పనులు చేసుకుని జీవించేవారు ఎక్కువగా వాటి ఉచ్చులో పడుతున్నారు. పక్కవారు తింటుంటే తాము రుచి చూద్దామని ఒక ప్యాకెట్ వేసుకుంటున్నారు. కొన్నిరోజులకు డోసు పెంచుతున్నారు. రోజుకు 20 ప్యాకెట్లు తీసుకునేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. గుట్కాలో నాలుగు వేలకు పైగా రసాయనాలు ఉంటాయని, 40కి పైగా కేన్సర్‌ను తెప్పించే కారకాలుంటాయని వైద్యులు అంటున్నారు. ప్రధానంగా గుట్కాలో నైత్రికాప్స్ అనే పదార్థాన్ని కలుపుతారు. ఇది ఆకలిని చంపేస్తుంది. నిద్ర పట్టనివ్వదు. అనేక వ్యాధులకు కారణమవుతోంది. చెవులు, పెదాలు, నాలుక, నోటి కిందభాగంలో కేన్సర్ ప్రబలే అవకాశాలు ఎక్కువ.
జీడి పిక్కల మాటున గుట్కా
అక్రమంగా తరలిస్తున్న ఖైనీ గుట్కాలను దత్తిరాజేరు మండలం స్టేషన్‌బూర్జివలస గ్రామ సమీపంలోని జంక్షన వద్ద ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి గుట్కాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ కె.రాజేష్ తెలిపారు. ఒడిశా నుంచి ఖైనీ, గుట్కాలు భారీగా తీసుకువస్తున్నట్లు అందిన సమాచారం మేరకు కొత్తవలస జంక్షన్ వద్ద మాటు వేసి తనిఖీలు చేపట్టారు. కోరాపుట్ నుంచి విజయనగరం వస్తున్న లారీని అడ్డుకున్నారు. తనిఖీ చేయగా జీడి పిక్కలు ఉన్నట్లు రవాణాదారులు నమ్మబలికారు. అయినా వెనక్కు తగ్గని పోలీసులు లోతుగా తనిఖీ చేశారు. కిందనున్న గుట్కా ప్యాకెట్లను గుర్తించి బయటకు తీశారు. వీటి విలువ 9 లక్షల 93వేల 280 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. నిందితులు ప్రకాష్ పాలై, దనపతి జానీ, యడ్ల గణపతిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేశారు.
గుట్కాల వల్ల ప్రాణహాని
గుట్కా, ఖైనీలు వినియోగిస్తే క్యాన్సర్ తెచ్చుకున్నట్టే. చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలి. లేకుంటే వారి భవిష్యత్‌ను నాశనం చేస్తాయి. గుట్కాలో ఉండే నైత్రికాప్స్ అనే రసాయనం ప్రాణాలను కబళిస్తుంది. నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ.
- ఎ.అజయ్‌కుమార్, వైద్యాధికారి, గజపతినగరం
దాడులు చేపడుతున్నాం
ఖైనీ, గుట్కాలు ఎక్కడ విక్రయిస్తున్నట్లు సమాచారం అందినా దాడులు చేస్తున్నాం. దత్తిరాజేరు మండలం బూర్జివలస పోలీస్ స్టేషన్ వద్ద తాజాగా రూ.10 లక్షల విలువ చేసే ఖైనీ గుట్కాలను పట్టుకున్నాం. ఖైనీ గుట్కాల అమ్మకంపై సమాచారం ఇచ్చే వివరాలను గోప్యంగా ఉంచుతాం.
-డి.రమేష్, సీఐ