అప్రమత్తత ఏదీ?

ABN , First Publish Date - 2021-08-28T04:41:10+05:30 IST

జిల్లాలో సీజనల్‌ వ్యాధులపై ముందస్తు ప్రణాళిక కొరవడింది. వీటిని నిరోధించడంలో యంత్రాంగం విఫలమైంది. సకాలంలో స్పందించడంలోనూ వెనుకబడింది. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జిల్లా కేంద్రాస్పత్రితో పాటు పార్వతీపురంలో ఏరియా ఆస్పత్రి ఉంది.

అప్రమత్తత ఏదీ?
గజపతినగరం : ఆస్పత్రిలో చేరిన జ్వరపీడితులు




 కానరాని ముందస్తు చర్యలు 

  సీజనల్‌ వ్యాధుల విజృంభణ

 రోగులతో నిండిపోతున్న ఆస్పత్రులు

 వెలుగుచూస్తున్న ‘డెంగ్యూ’ కేసులు

 రోజురోజుకూ పెరుగుతున్న బాధితులు

 గ్రామాల్లో కానరాని పారిశుధ్య పనులు

 నిధులు లేక చేతులెత్తేసిన పంచాయతీలు

(నెల్లిమర్ల)

జిల్లాలో సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. జ్వరపీడితులు, రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ఏటా వర్షాకాలం నాటికి వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టేది. కానీ ఈ ఏడాది ఆ ప్రణాళిక కొరవడింది. దీనికితోడు గ్రామాల్లో పారిశుధ్య పనులు నిలిచిపోవడంతో దోమలు సైరవిహారం చేసి రుగ్మతలు పెరుగుతున్నాయి. యంత్రాంగం తూతూమంత్రపు చర్యలకే పరిమితమవుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా సబ్‌ప్లాన్‌ మండలాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ కేసులు బయట పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 

జిల్లాలో సీజనల్‌ వ్యాధులపై ముందస్తు ప్రణాళిక కొరవడింది. వీటిని నిరోధించడంలో యంత్రాంగం విఫలమైంది. సకాలంలో స్పందించడంలోనూ వెనుకబడింది. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జిల్లా కేంద్రాస్పత్రితో పాటు పార్వతీపురంలో ఏరియా ఆస్పత్రి ఉంది. 11 సామాజిక ఆస్పత్రులు, 60 వరకూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) ఉన్నాయి. వేలాది మంది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఏటా వర్షాకాలానికి ముందుగానే సీజనల్‌ వ్యాధులను   ఎదుర్కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేసేవారు. ప్రమాదకర జ్వరాలు, వ్యాధుల నియంత్రణకు ఎలా ముందుకెళ్లాలి అన్నదానిపై ఉన్నత స్థాయిలో సమీక్షించేవారు. ఆస్పత్రుల్లో అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచేవారు. ఆస్పత్రి అభివృద్ధి సలహా మండలి సమావేశాలు నిర్వహించేవారు. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ఎక్కడా సన్నద్ధత కనిపించడం లేదు. దీంతో మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ జ్వరాలతో పాటు అన్నిరకాల వ్యాధులు ముసురుతున్నాయి. ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలందడం లేదు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది డెంగ్యూ కేసులు భయపెడుతున్నాయి. ఇప్పటివరకూ 73 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. గత ఏడాది ఈ సమయానికి కేవలం నాలుగు కేసులు మాత్రమే నమోదుకాగా..ఈ ఏడాది మాత్రం 73 వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల గజపతినగరం మండలంలో 8 కేసులు వెలుగుచూడడం కలకలం రేపింది. ఎక్కువ మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందుతుండడంతో ‘డెంగ్యూ’ కేసులకు సంబంధించి అసలైన లెక్క తేలడం లేదు.


 దోమలకు ఆవాసంగా గ్రామాలు

వ్యాధులు, జ్వరాలు పెరగడానికి పారిశుధ్యం క్షీణించడమే కారణమని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో పారిశుధ్య పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదు.   నిధుల లేవిని దీనికి కారణంగా పాలకవర్గాలు చూపుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 959 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీల్లో పారిశుధ్య పనులు, తాగునీటి వనరుల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసే ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేసేవారు. కానీ ఇటీవల ఆర్థిక సంఘం నిధులు విడుదలైనా ప్రభుత్వం పాలకవర్గాలకు తెలియకుండా వివిధ బకాయిల కింద జమ చేసుకుంది. కనీసం పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించుకోలేని స్థితిలో కొన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వీటికితోడు ఆదాయమున్న పంచాయతీలలో సైతం నిధుల ఖర్చుకు ప్రభుత్వం  మోకాలడ్డుతోంది. వ్యయ నియంత్రణ పేరుతో సీఎఫ్‌ఎంఎస్‌ విధానాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో నిధులున్నా ఖర్చు చేయలేకపోతున్నామని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


 ఏజెన్సీలో భయం..భయం

ఏజెన్సీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. మాతా శిశు మరణాలు సంభవిస్తున్నాయి. విద్యార్థులు, చిన్నారులు జ్వరాల బారినపడుతున్నారు.  ఐటీడీఏ సబ్‌ప్లాన్‌ మండలాలుగా పార్వతీపురం, గరుగుబిల్లి, గుమ్మలకీ్క్షపురం, కొమరాడ, జియ్యమ్మవలస, పాచిపెంట, మక్కువ, సాలూరు, కురుపాం, సీతానగరం, మెంటాడ ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఐటీడీఏ ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ప్రస్తుతం కొవిడ్‌ విధుల్లో యంత్రాంగం ఉంది. ఈ పరిస్థితుల్లో వ్యాధులు అదుపులోకి రావాలి. కానీ అందుకు విరుద్ధంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మేల్కొనాల్సిన అవసరముంది. 




Updated Date - 2021-08-28T04:41:10+05:30 IST