ఏ జ్వరమైనా...అనుమానమే!

ABN , First Publish Date - 2021-05-31T05:18:37+05:30 IST

ఏ విధంగా జ్వరం వచ్చినా కొవిడ్‌-19గానే అంతా భావిస్తున్నారు. నిర్ధారణ పరీక్షలు చేసుకోకుండా కరోనా మందులు వాడేస్తున్నారు. కరోనా పాజిటివ్‌కు ప్రభుత్వం కొన్ని రకాల మాత్రలను కిట్‌ రూపంలో అందిస్తోంది. నిర్ధారణ జరిగిన ప్రతి ఒక్కరికీ వైద్య ఆరోగ్య శాఖ ఏఎన్‌ఎంల ద్వారా ఇళ్లకు పంపిస్తున్నారు.

ఏ జ్వరమైనా...అనుమానమే!

  • కొందరిలో డెంగ్యూ లక్షణాలు
  • నిర్ధారించుకోకుండా కరోనా మందుల వాడకం
  • ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న బాధితులు


శృంగవరపుకోట, మే 30: ఎస్‌.కోట పట్టణానికి చెందిన ఎనిమిదేళ్ల బాలుడికి ఇటీవల జ్వరం వచ్చింది. రెండు రోజుల కిందట స్థానిక ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్లేట్‌లెట్స్‌ తక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించారు. డెంగ్యూ లక్షణాలుగా అనుమానించిన వైద్యులు విశాఖపట్టణంలోని ఓ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. 


ఓ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి ఎస్‌.కోట పట్టణంలో నివాసం ఉంటున్నాడు. వేరే చోట ఉద్యోగం చేస్తున్న అతని కుమారునికి ఇటీవల జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. కొవిడ్‌-19గా భావించి మందులు వాడేశారు. పరిస్థితి విషమించడంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షల్లో డెంగ్యూ జ్వరమని వైద్యులు చెప్పడంతో చికిత్సకు అక్కడే ఉంచారు. కానీ ప్రాణాలు దక్కలేదు. 


ప్రస్తుతం అక్కడక్కడ డెంగ్యూ లక్షణాలు కనిపిస్తున్నాయనడానికి ఈ రెండూ ఉదాహరణలు మాత్రమే. ఏ విధంగా జ్వరం వచ్చినా కొవిడ్‌-19గానే అంతా భావిస్తున్నారు. నిర్ధారణ పరీక్షలు చేసుకోకుండా కరోనా మందులు వాడేస్తున్నారు. కరోనా పాజిటివ్‌కు ప్రభుత్వం కొన్ని రకాల మాత్రలను కిట్‌ రూపంలో అందిస్తోంది. నిర్ధారణ జరిగిన ప్రతి ఒక్కరికీ వైద్య ఆరోగ్య శాఖ ఏఎన్‌ఎంల ద్వారా ఇళ్లకు పంపిస్తున్నారు. కరోనా పాజిటివ్‌ బాధితులున్న ఇళ్లల్లో నివసిస్తున్న మిగిలిన వారిని కూడా చుట్టపక్కల వారు దగ్గరకు రానివ్వకపోవడం, మాట్లాడకపోవడం చేస్తున్నారు. దీన్ని అవమానంగా భావిస్తున్న పలువురు జ్వరం, తలనొప్పి, జలుబు, ఒంటినొప్పులు వంటి లక్షణాలు కనిపించగానే ఎటువంటి పరీక్షలు చేయించుకోకుండా మందుల దుకాణాల నుంచి కరోనా మాత్రలను తెచ్చేసుకుంటున్నారు. వైద్యులను సంప్రదించకుండానే వాటిని వాడేస్తున్నారు. దీనివల్ల కొంతమందిలో కరోనా తగ్గుతోంది. మరి కొంతమందిలో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గుతున్నాయి. ఆ సమయంలో ఆదరాబాదరాగా ఆసుపత్రి మెట్లు ఎక్కుతున్నారు.


కరోనా కాకుండా డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరియా ప్రబలి ఉంటే అప్పుడు చికిత్స మొదలు పెడుతున్నారు. వీటికి కూడా కరోనా వచ్చినప్పుడు ఉండే జ్వరం, తలనొప్పి, జలుబు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలే ఉంటాయి. ఎటువంటి నిర్ధారణ పరీక్షలు చేసుకోకుండా వీటికి కరోనా మందులు వాడేయడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. జ్వరం రాగానే కరోనా అని అనుకోకుండా ముందు వైద్యులను సంప్రదించాలి. వారు సూచించిన విధంగా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి. ఈ మేరకు మందులు వాడాలి. అలా కాకుండా సొంత వైద్యం చేసుకుంటున్న వారిలో కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ సీజన్‌లో ఏటా వైరల్‌ జ్వరాలు వస్తుంటాయి. గిరిజన ప్రాంతాల్లో మలేరియా, టైఫాయిడ్‌ కేసులు నమోదవుతుంటాయి. దోమకాటుకు డెంగ్యూ కూడా వస్తుంది. దేనివల్ల జ్వరం వస్తుందో నిర్ధారించుకోవాలి. జిల్లాలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలతో పాటు ఇతర పరీక్షలు కూడా చేస్తున్నారు. ప్రాథమిక డెంగ్యూ లక్షణాలు తెలుసుకొనేందుకు ప్లేట్‌లెట్స్‌ పరీక్షలు చేసే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. కనీసం వీటినైనా వినియోగించుకుంటే ఏ జ్వరమో తెలుస్తుంది. దీనినిబట్టి మందులు వాడితే తిరిగి ఆరోగ్య వంతులుగా తయారుకావచ్చు.


వైద్యుల సలహా తీసుకోవాలి

 వైద్యుల సలహాలతో మందులు వాడాలి. వైద్యులు ఎప్పుడూ వ్యాధి నిర్ధారించాకే మందులు రాస్తారు. ప్రస్తుతం కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి ఉంది. జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు, జలుబు వంటి లక్షణాలతో వచ్చేవారికి ముందు కరోనా పరీక్షలు చేస్తున్నాం. వీటితో పాటు రోగి చెప్పిన విధానాన్ని బట్టి డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరియా పరీక్షలను సూచిస్తున్నాం. కొందరిలో కరోనాతో పాటు మిగిలిన వ్యాధి ఏదో ఒకటి కలిసి ఉంటోంది. పరిస్థితిని బట్టి చికిత్స అందిస్తున్నాం.

                - ఆర్‌.త్రినాథరావు, సూపరింటెండెంట్‌, ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి, ఎస్‌.కోట

         

Updated Date - 2021-05-31T05:18:37+05:30 IST