ఎరువు ఏదయా?

ABN , First Publish Date - 2021-08-30T04:56:10+05:30 IST

‘ఎరువులు అందుబాటులో ఉండడం లేదు. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తక్షణం రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో ఉంచండి’..ఇదీ ఇటీవల వ్యవసాయ సలహా మండలి సమావేశంలో అధికార పార్టీ ఎమ్మెల్యే విన్నపం. అంతలా ఉంది జిల్లాలో ఎరువుల కొరత దుస్థితి. ప్రధానంగా యూరియా, డీఏపీ కొరత అధికంగా ఉంది. దీంతో రైతులు అసౌకర్యానికి గురవుతున్నారు.

ఎరువు ఏదయా?
కాంప్లెక్స్‌ ఎరువు బస్తాలు

జిల్లాలో డీఏపీ, యూరియా కొరత

రైతుభరోసా కేంద్రాల్లో నోస్టాక్‌

ప్రైవేటు వ్యాపారుల వద్ద అదే పరిస్థితి

అదును దాటుతోందని రైతుల్లో ఆందోళన 

(కలెక్టరేట్‌)

‘ఎరువులు అందుబాటులో ఉండడం లేదు. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తక్షణం రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో ఉంచండి’..ఇదీ ఇటీవల వ్యవసాయ సలహా మండలి సమావేశంలో అధికార పార్టీ ఎమ్మెల్యే విన్నపం. అంతలా ఉంది జిల్లాలో ఎరువుల కొరత దుస్థితి. ప్రధానంగా యూరియా, డీఏపీ కొరత అధికంగా ఉంది. దీంతో రైతులు అసౌకర్యానికి గురవుతున్నారు. బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. 

జిల్లాలో ఖరీఫ్‌ వరి సాగు విస్తీర్ణం లక్షా 18 వేల హెకార్లు. సీజన్‌లో 40,450 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని గణాంకాలు చెబుతున్నాయి ఇందులో 11 వేల మెట్రిక్‌ టన్నులు డీఏపీ, 16,000 మెట్రిక్‌ టన్నులు పొటాష్‌, 1,400 మెట్రిక్‌ టన్నుల 28-28-00  రకం ఎరువులు అవసరమని అధికారులు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 524 రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు సరఫరా చేయనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో యూరియా, డీఏపీ ఎరువులు అందుబాటులో లేకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రైవేటు షాపుల్లో సైతం స్టాక్‌ లేదు. ఇండెంట్‌ పెట్టి ఐదు రోజులు గడుస్తున్నా ఇంతవరకూ నిల్వలు చేరుకోలేదు. దీంతో అదును దాటిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

వ్యవసాయ కూలీల ధరలు పెరిగాక పెట్టుబడులతో సతమతమవుతున్న అన్నదాతలపై ఎరువుల భారం కూడా పడింది. గత ఏడాదితో పోల్చితే 50 కిలోల కాంప్లెక్స్‌ ఎరువుల బస్తాపై రూ.50 నుంచి రూ.150 వరకు పెరిగింది. గతంలో యూరియా బస్తా రూ.250 ఉండగా.. ప్రస్తుతం మార్కెట్‌లో అదనంగా రూ.50 వసూలు చేస్తున్నారు. డీఏపీ బస్తా గతంలో రూ.900 ఉండగా, ప్రస్తుతం రూ.1250 పలుకుతోంది. గ్రోమోర్‌ బస్తా రూ.1000 నుంచి రూ.1300, పొటాష్‌ ధర రూ.300 నుంచి రూ.800 వరకు పెరిగింది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక.. విక్రయించిన ధాన్యానికి సకాలంలో బిల్లులు అందక రైతులు అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు కూడా పెరగడంతో నిరాశ చెందుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిసరుకుల ధర పెరగడంతో ఎరువుల ధరలు పెరిగాయని కంపెనీల యాజమాన్యాలు చెబుతున్నాయి. ‘రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం. ఆర్థికంగా భరోసా కల్పిస్తా’మని పాలకులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆచరణకు నోచుకోవడం లేదని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఆశాదేవి వద్ద ప్రస్తావించగా జిల్లాలో  యూరియా, డీఏపీ నిల్వలు ఉన్నాయని చెప్పారు. కావలసిన వారికి అందజేస్తామన్నారు. ప్రైవేటు డీలర్లు నేరుగా సంబంధిత కంపెనీల నుంచి తెప్పించు కుంటారని, వాటిని పర్యవేక్షిస్తామని తెలిపారు.



Updated Date - 2021-08-30T04:56:10+05:30 IST