‘మాన్సాస్’లో.. మరో మలుపు
ABN , First Publish Date - 2021-07-25T05:01:22+05:30 IST
మాన్సాస్ ట్రస్టు వ్యవహారాలు..

మాన్సాస్ ట్రస్టులో కీలక ఘటనలు
కమిషనరేట్‌ను తాకిన ఉద్యోగుల సమస్య
జీతాలు చెల్లించేందుకు సుముఖత
దేవదాయ శాఖ ద్వారా చెల్లించే యోచన
ఫ్రీజింగ్ ఖాతాల జోలికి పోకుండా కట్టడి
అశోక్ గజపతిరాజుఅధికారాలకు చెక్‌పెట్టే వ్యూహం
(విజయనగరం- ఆంధ్రజ్యోతి): మాన్సాస్ ట్రస్టు వ్యవహారాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఉద్యోగుల జీతాల సమస్య పరిష్కరిస్తూనే... చైర్మన్ అశోక్ గజపతిరాజును నామ్‌కే వాస్తేగా చేసే వ్యూహాన్ని దేవదాయ శాఖ రచించింది. వేల కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి అయినా చిల్లి గవ్వకూడా ఖర్చు చేయలేని విధంగా అన్నిదారులూ మూసేస్తోంది. అమరావతిలో శనివారం జరిగిన ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఫ్రీజింగ్ ఖాతాల జోలికి పోకుండా కట్టడి చేస్తోంది.
మాన్సాస్ దేవదాయ శాఖ పరిధిలో ఉండడంతో ఆ శాఖకు చెందిన రీజనల్ జాయింట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ అధికారితో పాటు ఉన్నత స్థాయి అధికారులంతా అమరావతిలో శనివారం ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం. ప్రభుత్వ సూచనలపై వారంతా చర్చించారు. ఇందులో ఉద్యోగుల సమస్యపై కూడా చర్చ సాగింది. ఏదో విధంగా జీతాలు చెల్లించడం ద్వారా వారి నుంచి వ్యతిరేకత రాకుండా చేసే వ్యూహాన్ని సిద్ధం చేశారు. మాన్సాస్‌కు చెందిన డిపాజిట్లు వివిధ బ్యాంకుల్లో ఉన్నాయి. వీటిని ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ అధికారి ఫ్రీజ్ చేశారు. దీంతో 125 కోట్ల రూపాయల నిధులను ఎవరూ విత్‌డ్రా చేసేందుకు అవకాశం లేదు. ఆ ఖాతాల జోలికి పోకుండా... నిధులపై చైర్మన్, కరస్పాండెంట్ పెత్తనాన్ని తగ్గించే వ్యూహాన్ని పన్నారు. అయితే ఉద్యోగుల జీతాల మాటేమిటి అన్నది చర్చకు వచ్చింది. ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూశారు. దేవదాయ శాఖ మాన్సాస్ ట్రస్టుకు ఏటా రూ.5 కోట్లు అందిస్తుంటుంది. ఆ నిధులతో ప్రస్తుత సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులతో ఏప్రిల్ నెల నుంచి జీతాలు చెల్లించేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు సమాచారం. దేవదాయ శాఖ నిధులతో ప్రస్తుతానికి జీతాలు చెల్లించి ఉద్యోగుల నుంచి వ్యతిరేకత లేకుండా చర్యలు చేపట్టనున్నారు.
ఖాతాలు ఇలా
మాన్సాస్‌లో జీతాల చెక్కులు వివిధ విద్యా సంస్థల నుంచి ప్రిన్సిపాళ్లకు సంతకాలతో వస్తాయి. వాటిని కరస్పాండెంట్ పరిశీలించి చెక్కులు విడుదల చేయడం ద్వారా బ్యాంకుల్లో ఉన్న ఖాతాల నుంచి బిల్లులు చెల్లించేవారు. సంచయిత చైర్పర్సన్ అయ్యేవరకు ఈ విధంగానే కొనసాగింది. ఆమె ప్రత్యేకంగా మరోవ్యక్తిని చీఫ్ ఫైనాన్స్ అధికారిగా(సీఎఫ్ఓ) నియమించుకున్నారు. బ్యాంకు ఖాతాల నుంచి నిధులు డ్రా చేసేందుకు కరస్పాండెంట్‌తో పాటు సీఎఫ్ఓకు సంయుక్తంగా అవకాశం ఇస్తూ తీర్మానం చేశారు. దీంతో ఏడాది కాలంగా ఉద్యోగుల జీతాల నిధులను జాయింట్ సిగ్నేచర్ ఆధారంగా విత్ డ్రా చేస్తున్నారు. జీతాల చెల్లింపల్లో ఎగ్జిక్యూటివ్ అధికారి పాత్ర పూర్తిగా లేదు. ఇదే అంశం శనివారం అమరావతిలోని దేవదాయశాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చర్చకు వచ్చింది. ఫ్రీజింగ్లో ఉన్న ఖాతాలను అలాగే ఉంచి మరో ఖాతా ద్వారా రీజనల్ జాయింట్ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ అధికారి జాయింట్ ఖాతా ఏర్పాటు చేయాలనేది నిర్ణయం. అందులో దేవదాయ శాఖ ఇచ్చే రూ.5 కోట్లు వేసి దశల వారీగా ఉద్యోగుల జీతాల చెల్లింపులకు విఘాతం లేకుండా చేయాలని నిర్ణయించారు. దీంతో ఇటు ఉద్యోగుల సమస్యకు పరిష్కారంతో పాటు అశోక్ అధికారాలకు కత్తెర, కరస్పాండెంట్, సంచయిత ఏర్పాటు చేసిన సీఎఫ్ఓకు అధికారాలు లేకుండా వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు.
ఫ్రీజింగ్ ఇలా
వాస్తవంగా అశోక్ చైర్మన్‌గా ఉన్నంత వరకు కరస్పాండెంట్ సంతకాలతోనే బ్యాంకుల లావాదేవీలు జరిగేవి. సంచయిత వచ్చిన తరువాత అమె కుటుంబానికి చెందిన వ్యక్తిని సీఎఫ్ఓగా నియమించి ఖాతాలపై జాయింట్ సిగ్నేచర్ ఉండేలా చర్యలు చేపట్టింది. బ్యాంకు ఖాతాలపై ఈవో ప్రమేయం ఉండేది కాదు. దీనివల్ల ఖాతాలు ఫ్రీజింగ్ చేసే అధికారం ఈఓకు లేకపోయింది. కానీ 2015కు ముందు జీవో నెంబర్ 52 అమల్లో ఉండేది. ఈవో, కరస్పాండెంట్ ఒకే వ్యక్తి ఉండాలన్నది ఈ జీవో సారాంశం. దీనిని తాజాగా వెలుగులోకి తెచ్చిన ఈవో ట్రస్టు ఖాతాలను ఫ్రీజింగ్ చేయగలిగారు.