ఒప్పుకో...తప్పుకో!

ABN , First Publish Date - 2021-02-07T05:05:58+05:30 IST

రాజకీయ చదరంగంలో నేతలు మెదడుకు పదును పెంచారు. అప్పటికప్పుడు ఎత్తులు మారుస్తున్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం చివరిదశ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటివరకు చర్చించారు.. బతిమలాడారు.. ఆశ చూపారు..

ఒప్పుకో...తప్పుకో!


అభ్యర్థులకు తాయిలాలు 

తొలి దశ ఎన్నికల్లో జోరుగా బేరాలు

 ఉపసంహరణలకు యత్నం

 మరోవైపు రెండో దశలో భారీగా నామినేషన్లు 


రాజకీయ చదరంగంలో నేతలు మెదడుకు పదును పెంచారు. అప్పటికప్పుడు ఎత్తులు మారుస్తున్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం చివరిదశ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటివరకు చర్చించారు.. బతిమలాడారు.. ఆశ చూపారు.. ఇప్పుడు ఎర వేస్తున్నారు. బెట్టు చేసే వారిని తమ దారికి తెచ్చుకునే ప్రయత్నాలు తీవ్రం చేశారు. తప్పుకుంటే తాయిలాలు ఇస్తామని ప్రకటించేస్తున్నారు. ఈ విధంగా తొలి దశ ఎన్నికలు జరిగే పంచాయతీల్లో సమీకరణాలు జోరుగా మారుతున్నాయి. మరోవైపు రెండు దశకు సంబంధించి తొలిరోజే భారీగా నామినేషన్లు పడ్డాయి. 


(విజయనగరం- ఆంధ్రజ్యోతి)/ రామభద్రపురం/  కలెక్టరేట్‌, ఫిబ్రవరి 6:

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో ఏకగ్రీవాలపై అధికార పార్టీ నాయకులు పూర్తిగా దృష్టి పెట్టారు. రెబల్స్‌ను చల్లార్చడం.. ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్‌ ఉపసంహరించుకొనేలా చేయడంలో అస్త్రశస్త్రాలు ఉపయోగిస్తున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతలను పార్టీ అధినేత ఎమ్మెల్యేలకు అప్పగించడంతో అన్ని నియోజకవర్గాల్లో మండలాల నాయకులతో వారు చర్చలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ప్రత్యర్థులను బరి నుంచి తప్పించేందుకు ఒకవైపు తాయిలాలు.. మరోవైపు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వైసీపీ మద్దతుతో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేసిన చోట ఎమ్మెల్యేలే రంగంలోకి దిగుతున్నారు. అవసరమైతే అక్కడకు వెళ్లి మాట్లాడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మరో 48 గంటలు మాత్రమే గడువుంది.  ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. 

జిల్లాలో తొలి దశలో పార్వతీపురం డివిజన్‌లోని 15 మండలాల పరిధిలో 415 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిల్లో ఇప్పటివరకు 1,973 మంది సర్పంచ్‌ అభ్యర్థులు, 8,073 మంది వార్డు అభ్యర్థులు మిగిలారు. ఉప సంహరణ పూర్తయ్యాక అభ్యర్థుల వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి. ఉపసంహరణకు ఈ నెల 8 వరకూ గడువున్న కారణంగా మరికొంత మంది అభ్యర్థులు తగ్గే అవకాశం ఉంది. మొదటి విడత పంచాయతీల్లో ఈ నెల 13న పోలింగ్‌ జరుగనుంది.  

రెండో దశ హోరా హోరీ 

జిల్లాలోని తొమ్మిది మండలాల పరిధిలో రెండో దశ పోలింగ్‌ ఈ నెల 17న జరగనుంది. ఈ విడతకు సంబంధించి బుధవారం వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. తొలిరోజు శనివారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం మంచిరోజు కావడంతో మరింత మంది నామినేషన్లు వేయొచ్చు.

గ్రామాల్లో కోలాహలం 

గ్రామాలు కోలాహలంగా మారాయి. పగలు.. రాత్రి తేడా లేకుండా రచ్చబండ చర్చలు ఊపందుకున్నాయి. రెండో విడత ఎన్నికలయ్యే గ్రామాల్లో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థుల వెంట జనం హోరెత్తుతున్నారు. విందులు, మద్యం సరఫరా విచ్చలవిడిగా సాగుతోంది. ఎక్కువ సర్పంచ్‌ స్థానాలు మహిళలకు రిజర్వు కావడంతో వారు కూడా అధిక సంఖ్యలో తరలి వెళ్తున్నారు. గ్రామల్లో ఎన్ని‘కళ’ ఉట్టిపడుతోంది.


రెండో విడతలో తొలిరోజు నామినేషన్లు ఇలా..

మండలం సర్పంచ్‌ వార్డు మెంబర్లు

చీపురుపల్లి          52 245

పూసపాటిరేగ         78 315

మెరకముడిదాం 53 91

డెంకాడ 25 146

గరివిడి 73 265

భోగాపురం 43 158

గుర్ల         88 255

విజయనగరం         51 213

నెల్లిమర్ల 58 271


వైసీపీలో వర్గపోరు 

పంచాయతీ ఎన్నికల పోరులో వైసీపీలో నాయకుల మధ్య లుకలుకలు బయటపడుతున్నాయి. ఇన్నాళ్లూ లోలోపల ఉన్న మనస్పర్థలు ఇప్పుడు బహిర్గతం అవుతున్నాయి. రామభద్రపురం మండలంలోని 22 పంచాయతీల్లో సుమారు 12 పంచాయతీలకు పైబడి ఆ పార్టీకి చెందినవారు ఇద్దరేసి పోటీ పడుతున్నారు. ఇది చూస్తే వర్గపోరు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఆ గ్రామాల్లో వైసీపీ వర్గం రెండుగా చీలిపోయింది. ఆరికతోట, దుప్పలపూడి, కోటశిర్లాం, రావివలస, నాయుడువలస, కొట్టక్కి, నర్సాపురం, సోంపురం, జన్నివలస తదితర పంచాయతీల్లో సర్పంచ్‌ అభ్యర్థుల మధ్య నువ్వా? నేనా? అన్నట్లు పోటీ నెలకొంది. అక్కడ ఫలితం ఎలా ఉంటుందోనని  స్థానికులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒకే పార్టీకి చెందినవారు ఒకటి, రెండు పంచాయతీలు తప్ప ఇంత పెద్ద ఎత్తున పోటీ పడడం గతంలో ఎప్పుడూ లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పోరు వల్లప్రతిపక్ష మద్దతు అభ్యర్థికి ఎంతోకొంత లాభం చేకూర్చే అవకాశం ఉందని మరికొంతమంది భావిస్తున్నారు. 

ఎన్నికల సిబ్బంది కేటాయింపు 

జిల్లాలో తొలివిడతగా ఈ నెల 13న పార్వతీపురం డివిజన్‌లో జరిగే తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ర్యాండమ్‌గా సిబ్బందిని కేటాయించారు. ఎన్నికల కమిషన్‌ నియమ నిబంధనలు అనుసరించి పోలింగ్‌ కేంద్రాల వారీగా పీవోలు, ఓపీవోలను అవసరమైన మేరకు కేటాయించారు. ఎన్‌ఐసీ కేంద్రంలో కలెక్టర్‌, ఎన్నికల సాధారణ పరిశీలన అధికారినాగలక్ష్మి సెల్వరాజన్‌ పర్యవేక్షణలో శనివారం ఈ ప్రక్రియ పూర్తిచేశారు. 415 పంచాయతీల్లో 3,908 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అదనపు సిబ్బందితో కలిపి 5421 మంది పీవోలను, 5271 మంది ఓపీవోలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 200 కన్నా తక్కువ ఓటర్లుంటే ఒక పీవోను, 200-400 వరకూ ఓటర్లుంటే ఇద్దరు పీవోలు, 400కు మించితే ముగ్గురు పీవోలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రక్రియంతా ఆన్‌లైన్‌లో జరిగింది. కార్యక్రమంలో జేసీ మహేష్‌కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ కట్టా సింహాచలం, డీఆర్‌వో గణపతిరావు, లైజన్‌ అధికారి సునీల్‌రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫొటోతో ఓటర్‌ స్లిప్పులు

పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు ఫొటోతో కూడిన స్లిప్పులను పంపిణీ చేస్తామని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.  పోలింగ్‌కు ముందురోజు గ్రామంలో పనిచేసే సిబ్బంది సహకారంతో పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫొటో ఓటర్‌ స్లిప్పుల పంపిణీ వల్ల ఓటర్‌ తాను ఏ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయాల్సి ఉంటుందో సులువుగా గుర్తిస్తారని, పోలింగ్‌ కేంద్రంలోని సిబ్బంది కూడా ఓటర్‌ స్లిప్పుల ఆధారంగా జాబితాలోని ఓటరు పేరును, క్రమ సంఖ్యను గుర్తించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.  ఫొటో ఓటర్‌ స్లిప్‌ తీసుకువెళ్లడం తప్పనిసరి కాదని, ఓటర్‌ స్లిప్‌ లేకపోయినా, ఫొటోతో కూడిన గుర్తింపు కార్డు లేదా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సూచించిన ఏదైనా గుర్తింపు కార్డు ఆధారంగా ఓటు వేసేందుకు అనుమతిస్తారని పేర్కొన్నారు. 


Updated Date - 2021-02-07T05:05:58+05:30 IST