నేడు జడ్పీ సమావేశం

ABN , First Publish Date - 2021-12-19T06:01:25+05:30 IST

సుమారు మూడేళ్ల తరువాత జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఆదివారం జరగనున్నది

నేడు జడ్పీ సమావేశం

అజెండాలో స్టాండింగ్‌ కమిటీల ఎన్నిక, సాధారణ బడ్జెట్‌ ఆమోదంవిశాఖపట్నం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): సుమారు మూడేళ్ల తరువాత జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఆదివారం జరగనున్నది. ఈ ఏడాది మార్చిలో జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించగా, కోర్టు కేసుల వల్ల ఓట్ల లెక్కింపు సెప్టెంబరులో జరిగింది. జడ్పీటీసీ చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా ఏడు స్టాండింగ్‌ కమిటీల ఎన్నికలు చేపట్టాల్సి ఉంది. ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో సమావేశం నిర్వహణ వాయిదా పడింది. ఎన్నికల కోడ్‌ ముగియడంతో ఆదివారం సమావేశం నిర్వహణకు ఏర్పాట్లుచేశారు. ఈ సమావేశానికి జడ్పీ చైర్‌పర్సన్‌ జి.సుభద్ర అధ్యక్షత వహిస్తారు. తొలుత ఏడు స్టాండింగ్‌ కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, విద్య, పనులకు సంబంధించిన నాలుగు కమిటీలకు జడ్పీ చైర్‌పర్సనే...చైర్మన్‌గా ఎన్నికవుతారు. మిగిలిన వ్యవసాయం, స్త్రీ, సాంఘిక సంక్షేమాలకు సంబంధించిన మూడు కమిటీల్లో రెండింటికి ఇద్దరు వైస్‌ చైర్మన్లు స్టాండింగ్‌ కమిటీ చైర్మన్లుగా ఉంటారు. ప్రతి కమిటీలో చైర్మన్‌తోపాటు ఏడుగురు సభ్యులు ఉంటారు. జిల్లా పరిషత్‌లో వైసీపీకి 37, టీడీపీ, సీపీఎంలకు ఒక్కొక్క సభ్యుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలు లాంఛనమేనని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక తరువాత జడ్పీ సాధారణ బడ్జెట్‌ ఆమోదిస్తారు. చివరగా సభ్యులు, అధికారుల పరిచయం ఉంటుంది. కాగా సమావేశం వివరాలను సభ్యులు, అధికారులకు అందజేశామని జడ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్‌ తెలిపారు.  

Updated Date - 2021-12-19T06:01:25+05:30 IST