వైసీపీలో భూకంపం

ABN , First Publish Date - 2021-10-14T06:25:46+05:30 IST

కశింకోట మండలం విస్సన్నపేట, జమాదులపాలెం గ్రామాల్లో భూముల కబ్జా వ్యవహారం అధికార వైసీపీలో తీవ్ర కలకలం రేపింది.

వైసీపీలో భూకంపం

కలకలం రేపిన ‘ఆంధ్రజ్యోతి’ కథనం

ఆ ఇద్దరు నేతలెవరనే అంశంపై తీవ్ర చర్చ

కొండలు, గుట్టలు, గెడ్డలు చదును చేయడంపై విస్మయం

అధిష్ఠానం ఆరా తీసినట్టు సమాచారం

విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా

ఆర్డీవోకు కలెక్టర్‌ ఆదేశాలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కశింకోట మండలం విస్సన్నపేట, జమాదులపాలెం గ్రామాల్లో భూముల కబ్జా వ్యవహారం అధికార వైసీపీలో తీవ్ర కలకలం రేపింది. రెండు గ్రామాల్లో కొండలు, ప్రభుత్వ భూములను అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు గుట్టుచప్పుడు కాకుండా చదును చేయిస్తున్న వ్యవహారంపై ‘గప్‌చుప్‌గా భూయజ్ఞం’ శీర్షికన బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కథనం అధికార పార్టీ నేతలతోపాటు అనకాపల్లి పరిసర ప్రాంతాల్లోని స్థానిక నేతలను, ప్రజా ప్రతినిధులను ఉలికిపాటుకు గురిచేసింది. ఆ కథనంలో పేర్కొన్న ప్రజా ప్రతినిధి, కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎవరనే దానిపై నేతలతోపాటు పార్టీ కార్యకర్తలు ఆరా తీయడం కనిపించింది. భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు, అధికారుల పోస్టింగ్‌లు, బదిలీల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న ఒక ప్రజా ప్రతినిధితోపాటు అధికారంలోకి రాకముందు నుంచి ఆయనకు అనుచరుడిగా మెలుగుతున్న ఓ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఈ భూముల సేకరణలో కీలకపాత్ర పోషించారని అనకాపల్లి ప్రాంతంలో చర్చించుకుంటున్నారు. ఏదో కొంతమేర భూములు కొని చదును చేస్తున్నారని తెలుసుకానీ... ఇంత భారీస్థాయిలో కొండలు, వాగులు, గెడ్డలు ఆక్రమించుకున్నారనే విషయాన్ని తాము కూడా గుర్తించలేదని అంటున్నారు. భూముల వ్యవహారంలో తెరవెనుక పెద్ద తలకాయలుండే అవకాశం లేకపోలేదంటున్నారు.

జిల్లాలో ప్రజా ప్రతినిధులు, నేతలపై ఇటీవల కాలంలో భూకబ్జా ఆరోపణలు పెరుగుతున్న నేపథ్యంలో విస్సన్నపేట భూముల వ్యవహారాన్ని అధిష్ఠానం సీరియస్‌గా పరిగణిస్తుందని వైసీపీ నేతలే చెబుతున్నారు. ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై వివరాలు తెలుసుకుని నివేదిక అందజేయాలని నగరంలోని కీలక నేతలను అధిష్ఠానం ఆదేశించినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై బహిరంగంగా మాట్లాడేందుకు ఎవరూ సుముఖంగా లేకపోయినా ‘ఆంధ్రజ్యోతి’ కథనం క్లిప్పింగ్‌ను కొందరు పార్టీ అధిష్ఠానానికి, సీఎం పేషీకి, ఇంటిలిజెన్స్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రెండు గ్రామాల మధ్య వున్న కొండలు, వాగులు, గెడ్డలు, బంజర్లు, డీఫారం భూముల వివరాలను సేకరించే పనిలో అధికార పార్టీలోని కొంతమంది నేతలు నిమగ్నమైనట్టు సమాచారం. గురువారం లేదా దసరా తరువాత వివరాలు సేకరించాలని యోచిస్తున్నారు. 

ఇదిలావుండగా ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున స్పందించారు. వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి విచారణ చేపట్టాలని అనకాపల్లి ఆర్డీవో సీతారామారావును ఆదేశించారు. సర్వే అధికారులతో కలిసి ఆర్డీవో విస్సన్నపేట భూములు సందర్శించారు. అక్కడే రికార్డులు పరిశీలించారు. అయితే కొండల్లో 73 ఎకరాల వరకు జిరాయితీ వుందని ఆర్డీవో చెప్పడం గమనార్హం. కొండలు జిరాయితీ ఎలా అవుతాయో? ఆయనే చెప్పాలి. అయితే భూములు చదునుచేసే ప్రాంతానికి పడమర దిక్కున వున్న కొండల నుంచి వచ్చే వర్షపునీరు కిందనున్న రంగబోలు గెడ్డ రిజర్వాయర్‌లోకి వస్తోంది. భూములు చదును చేసే క్రమంలో వాగులు, గెడ్డలను కప్పేయడాన్ని ఆయన పరిశీలించారు. నీటి ప్రవాహాలు జిరాయితీలో వున్నా ఎట్టి పరిస్థితుల్లో పూడ్చరాదని అక్కడ వున్న సిబ్బందిని ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం కలెక్టర్‌కు నివేదిక ఇవ్వాలని ఆర్డీవో నిర్ణయించారు. ఇదిలావుండగా భూములు చదునుచేసే చోట నుంచి టిప్పర్ల ద్వారా గ్రావెల్‌, మట్టి, రాళ్లు తరలిస్తున్నా గనుల శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. అనకాపల్లి ఏడీ కార్యాలయం సిబ్బంది తీరుపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు ఉన్నాయి. కాగా విస్సన్నపేట గ్రామ పంచాయతీ కార్యాలయం అధికారులు, సచివాలయం కార్యదర్శి కూడా మౌనంగా ఉంటున్నారు. వీరిని అధికార పార్టీ నేతలు బెదిరించారని ప్రచారం సాగుతున్నది.

Updated Date - 2021-10-14T06:25:46+05:30 IST