తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల నిరసన

ABN , First Publish Date - 2021-03-21T06:21:23+05:30 IST

అరకులోయ పట్టణంలో మంచి నీటి సమస్యను పరిష్కరించాలంటూ గిరిజన సంఘం, గిరిజన మహిళా సంఘం, ఐద్వా నేతల ఆధ్వర్యంలో శనివారం ఖాళీబిందెలతో మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల నిరసన
శరభగుడ హౌసింగ్‌ కాలనీలో ఖాళీబిందెలతో నిరసన ప్రదర్శన చేస్తున్న మహిళలు



అరకులోయ, మార్చి 20: అరకులోయ పట్టణంలో మంచి నీటి సమస్యను పరిష్కరించాలంటూ గిరిజన సంఘం, గిరిజన మహిళా సంఘం, ఐద్వా నేతల ఆధ్వర్యంలో శనివారం ఖాళీబిందెలతో మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఐద్వా, గిరిజన మహిళా సంఘం నేతలు వీవీ.జయ, భానులతోపాటు పాతపోస్టాఫీస్‌ పరిసర కాలనీ మహిళలు మంచినీటి సమస్యను పరిష్కరించాలని ఆందోళన చేశారు. పైప్‌లైన్‌ల నుంచి మంచినీటి సరఫరా కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఎన్ని పర్యాయాలు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించారని తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా ఏపీ గిరిజన సంఘం నేత రామారావు ఆధ్వర్యంలో శర్మగుడ కాలనీ మహిళలంతా ఖాళీ బిందెల ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలో కోట్లాది రూపాయలతో గత ప్రభుత్వం ఇంటింటా కొళాయిలు ఏర్పాటు చేస్తే అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యంతో కొళాయిల్లో నీటి సరఫరా కావడం లేదని ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు మండల స్థాయి అధికారుల దృష్టి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఉన్నతస్థాయి అధికారులు దృష్టి సారించి మంచి నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఏపీ గిరిజన సంఘం,ఐద్వా, గిరిజన మహిళా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-03-21T06:21:23+05:30 IST