రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN , First Publish Date - 2021-11-21T05:49:41+05:30 IST

నగరంలోని సత్యం కూడలి సిగ్నల్‌ పాయింట్‌ వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కుమార్తె మృతదేహం వద్ద విలపిస్తున్న సన్యాసిరెడ్డి. (ఇన్‌సెట్లో) మృతురాలు రేవతి (ఫైల్‌ ఫొటో)

తండ్రికి స్వల్ప గాయాలు

మృతురాలు ఆరు నెలల గర్భిణి

మద్దిల పాలెం, నవంబరు 20: నగరంలోని సత్యం కూడలి సిగ్నల్‌ పాయింట్‌ వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రేసపువానిపాలేనికి చెందిన గొరుసు రేవతి (35) అనే మహిళ చైతన్యనగర్‌ కాకతీయ కన్వెన్షన్‌ సమీపంలోని భావన ప్రైవేట్‌ పాఠశాలలో హిందీ టీచర్‌గా పనిచేస్తుంది. కాగా మృతురాలు ఆరు నెలల గర్భిణి అని తెలిసింది. ఆమె భర్త షేక్‌వల్లి చెకెన్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లడానికి తన తండ్రి సన్యాసిరెడ్డితో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరింది. సత్యం కూడలిలోని సిగ్నల్‌ పాయింట్‌ వద్దకు వచ్చేసరికి మద్దిలపాలెం నుంచి గురుద్వార వైపు వెళుతున్న లారీ వీరి బైక్‌ను ఢీకొంది. దీంతో తండ్రీకుమార్తెలు రోడ్డుపై పడిపోయారు. రేవతి తలకు తీవ్ర గాయాలవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సన్యాసిరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. కళ్లెదుటే కుమార్తె మృతి చెందడంతో ఆయన కన్నీరుమున్నీరయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం రేవతి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. లారీ డ్రైవర్‌ను ఎస్‌ఐ రాము అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-11-21T05:49:41+05:30 IST