ఆ 2 ఎప్పుడు పట్టాలెక్కేనో!?
ABN , First Publish Date - 2021-07-09T05:28:28+05:30 IST
తూర్పు కోస్తా రైల్వే జోన్ అధికారులు వాల్తేరు డివిజన్‌పై అన్ని అంశాల్లోను వివక్ష ప్రదర్శిస్తున్నారు.

పునఃప్రారంభం కాని జన్మభూమి, తిరుమల
రద్దీ లేదనే వంకతో జాప్యం
ప్రయాణికుల అసంతృప్తి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
తూర్పు కోస్తా రైల్వే జోన్ అధికారులు వాల్తేరు డివిజన్‌పై అన్ని అంశాల్లోను వివక్ష ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రాంత ప్రయాణికుల రవాణా అవసరాలను పట్టించుకోవడం లేదు. ఒడిశాలో సూరత్ వాసులు ఉన్నారని, ఇక్కడి నుంచి బయలుదేరాల్సిన ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసి భువనేశ్వర్ నుంచి నడుపుతున్నారు. కరోనా ఆంక్షలు పూర్తిగా ఎత్తేసి, అన్ని వ్యాపారాలు నడుస్తున్నా తిరుమల రైలును రీషెడ్యూల్ చేయలేదు. పునఃప్రారంభ తేదీ ప్రకటించలేదు. ఎవరైనా అడిగితే డిమాండ్ లేదని, ప్రయాణికుల సంఖ్య తక్కువగా వుందని సాకులు చెబుతున్నారు.
విజయవాడ వైపు వెళ్లే రైళ్ల విషయంలోను అదే ధోరణి ప్రదర్శిస్తున్నారు. విశాఖపట్నం-విజయవాడ మధ్య రైళ్లకు డిమాండ్ అధికం. ప్రస్తుతం సింహాద్రి, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లు (ప్రత్యేక రైళ్లేగా) నడుస్తున్నాయి. హైదరాబాద్‌కు గోదావరి, గరీభ్‌రథ్ నడుపుతున్నారు. ఈ రెండూ ఫుల్ డిమాండ్‌తో వెళుతున్నాయి. అయితే రద్దీ లేదని వంకలు పెడుతూ, విజయవాడ మీదుగా విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే జన్మభూమిని పునరుద్ధరించడానికి వెనకాడుతున్నారు. ఈ రైలు కోసం ఎంతోమంది ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. కానీ రైల్వే అధికారులు రీషెడ్యూల్‌పై పెదవి విప్పడం లేదు. ఇంతకు ముందు రెగ్యులర్‌గా ఫుల్ డిమాండ్‌తో నడిచిన రైళ్లను వెంటనే పునరుద్ధరించాల్సి ఉండగా, వాటిపై దృష్టిపెట్టడం లేదు.
వారికోసం అయితే ఓకే
విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య 08570/569 నంబరుతో ఒక రైలు నడుస్తోంది. దీనిని కూడా కరోనా నేపథ్యంలో ఆపేశారు. ఇది ఒడిశా ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో రీషెడ్యూల్ చేసి ఈ నెల 14 నుంచి నడపడానికి ఏర్పాట్లుచేశారు. ఈ ప్రాంతం వారికి కాకుండా ఎక్కడో దూరప్రాంతాల వారికి ఎక్కువగా ఉపయోగపడే విశాఖపట్నం-షాలీమార్, విశాఖపట్నం-దిగా, విశాఖపట్నం-నాందేడ్, విశాఖపట్నం-టాటా రైళ్లను ప్రధాన రైళ్ల కంటే ముందు రీషెడ్యూల్ చేశారు. షాలీమార్ ఎక్స్‌ప్రెస్ బుధవారం నుంచి నడుస్తుండగా, దిగా ఎక్స్‌ప్రెస్ గురువారం ప్రారంభమైంది. నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ను వారానికి మూడు రోజులు చొప్పున ఈ నెల పదో తేదీ నుంచి నడపనున్నారు. టాటా ఎక్స్‌ప్రెస్ 11వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఎక్కడెక్కడో ఉన్నవారి గురించి ఆలోచిస్తున్న అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరమైన రైళ్లను ఎందుకు పునరుద్ధరించరనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.