రక్తతర్పణం చేసైనా ఉక్కును కాపాడుకుంటాం

ABN , First Publish Date - 2021-11-02T06:45:36+05:30 IST

రక్తతర్పణం చేసైనా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటామని ఉక్కు సాధన ఉద్యమ సారఽథి డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు పరిరక్షణ వేదిక, విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో సోమవారం పాత పోస్టాఫీస్‌ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు

రక్తతర్పణం చేసైనా ఉక్కును కాపాడుకుంటాం
సభలో మాట్లాడుతున్న డాక్టర్‌ రాజమోహన్‌, వేదికపై ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, విద్యార్థి, ప్రజా సంఘాల ప్రతినిధులు

ఉక్కు సాధన ఉద్యమ సారఽథి డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌

విశాఖపట్నం, నవంబరు 1 : రక్తతర్పణం చేసైనా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటామని ఉక్కు సాధన ఉద్యమ సారఽథి డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ  ఉక్కు పరిరక్షణ వేదిక, విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో సోమవారం పాత పోస్టాఫీస్‌ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. విశాఖ ఉక్కు సాధన కోసం 1966 నవంబరు 1న జరిగిన ఉద్యమంలో ఇక్కడే 12 మంది పోలీస్‌ తూటాలకు బలయ్యారన్నారు. ఈ సందర్భంగా వారికి స్మృత్యంజలి ఘటించారు. లక్షల కోట్లు విలువ చేసే స్టీల్‌ప్లాంట్‌ను వేల కోట్లకు అమ్మేయాలని చూస్తే  బీజేపీ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయన్నారు.  స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌.నరసింగరావు మాట్లాడుతూ ప్రభుత్వ పరిశ్రమల అమ్మకమే బీజేపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.  సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి,  స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ సమితి నాయకులు మంత్రి రాజశేఖర్‌,  డి.ఆదినారాయణ,  ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్‌ బిశ్వాస్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ కార్యదర్శి విక్కీమహేశ్వరి, పీడీఎస్‌ఓ రాష్ట్ర కార్యదర్శి ఎ.సురేశ్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి  సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. 

మహా ప్రదర్శన

 విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నగరంలో మహా ప్రదర్శన జరిగింది. వివిధ కళాశాలల విద్యార్థులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఏవీఎన్‌ కళాశాల నుంచి ప్రారంభమైన మహా ప్రదర్శన టౌన్‌కొత్తరోడ్డు మీదుగా పాతపోస్టాఫీస్‌ దగ్గర ఏర్పాటు చేసిన సభాస్థలి వరకు కొనసాగింది.  విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ఎవడురా అమ్మేది, ఎవడురా కొనేది.  ఉక్కు మనది -హక్కు మనది, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు,, స్ట్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలి, బీజేపీ హఠావో- దేశ్‌ బచావో,  కేంద్రం మొండి వైఖరి విడనాడాలి, మోదీ నిరంకుశ విధానాలు నశించాలి...తదితర నినాదాలతో మహా ప్రదర్శన కొనసాగింది. 


Updated Date - 2021-11-02T06:45:36+05:30 IST