కార్మికులను ఇక్కట్లకు గురిచేసే ప్రభుత్వాలు మనలేవు

ABN , First Publish Date - 2021-11-10T05:19:32+05:30 IST

కార్మిక, కర్షకులను ఇక్కట్లకు గురి చేస్తున్న ప్రభుత్వాలకు మనుగడ లేదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధి ఎన్‌.రామారావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం కూర్మన్నపాలెంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరంలో 271వ రోజు పాల్గొన్న కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పట్టుగొమ్మ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగంలోనే ఉంచుతామని ప్రకటించే వరకూ ఈ ఉద్యమం ఆగదన్నారు.

కార్మికులను ఇక్కట్లకు గురిచేసే ప్రభుత్వాలు మనలేవు
రిలే నిరాహార దీక్షల శిబిరంలో మాట్లాడుతున్న ఎన్‌.రామారావు, పాల్గొన్న ఉద్యోగులు

కూర్మన్నపాలెం, నవంబరు 9: కార్మిక, కర్షకులను ఇక్కట్లకు గురి చేస్తున్న ప్రభుత్వాలకు మనుగడ లేదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధి ఎన్‌.రామారావు అన్నారు.  స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం కూర్మన్నపాలెంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరంలో 271వ రోజు పాల్గొన్న కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పట్టుగొమ్మ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగంలోనే ఉంచుతామని ప్రకటించే వరకూ ఈ ఉద్యమం ఆగదన్నారు. ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే దేశ సంపదను పరిరక్షించుకోవడం సాధ్యమన్నారు. పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ తమకు జరిగిన ఆన్యాయాన్ని కార్మిక, కర్షక వర్గం ప్రశ్నిస్తే, కేసుల పేరిట భయపెట్టడం కేంద్రానికి రివాజుగా మారింద్నారు. బడా బాబులు ప్రజా ధనాన్ని బ్యాంకుల నుంచి రుణాల   రూపంలో తీసుకొని ఎగ్గొడితే వారిపై ఎలాంటి చర్యలు లేవన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అప్పులు తీసుకుంటే వాటికి వక్రభాష్యం చెబుతున్నారన్నారు. ప్రభుత్వరంగాలను తమ తాబేదార్లకు కట్టబెట్టాలన్న కుయుక్తితోనే కేంద్ర ప్రభుత్వం దారుణ చర్యలకు ఒడిగడుతోందన్నారు. పోరాట కమిటీ నేత  గంధం వెంకట్రావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని, ఉక్కు కార్మికులకు రాష్ట్ర ప్రజలు అందరూ తోడుగా ఉంటారన్నారు. మరో నేత కె.సత్యనారాయణ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంటుకు భూములు ఇచ్చిన ప్రజలను కూడా ఇక్కట్లు పాలయ్యేలా ప్రభుత్వాలు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.. ఈ కార్యక్రమంలో  వేములపాటి ప్రసాద్‌, గంగవరం గోపి, మూర్తి, రమేష్‌, నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.

 


Updated Date - 2021-11-10T05:19:32+05:30 IST