వాల్తేరు రైల్వేకూ మంగళం!

ABN , First Publish Date - 2021-03-21T06:31:09+05:30 IST

విశాఖపట్నం చరిత్రను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోంది. వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే...అందులో ఏమాత్రం అవాస్తవం లేదని అంతా అంగీకరిస్తారు.

వాల్తేరు రైల్వేకూ మంగళం!

ఇప్పటికే స్టీల్‌ప్లాంటును 100 శాతం ప్రైవేటుపరం చేయనున్నట్టు ప్రకటన

ఇప్పుడు...విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్‌ను రద్దు చేస్తున్నట్టు పునరుద్ఘాటన

విశాఖపై కేంద్రం కక్ష కట్టినట్టుందని నగరవాసుల ఆగ్రహం

చరిత్ర లేకుండా చేస్తున్నారని ఆవేదన

రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నిలదీయలేకపోతోందని అసంతృప్తి


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


విశాఖపట్నం చరిత్రను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోంది. వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే...అందులో ఏమాత్రం అవాస్తవం లేదని అంతా అంగీకరిస్తారు. ‘విశాఖ ఉక్కు...ఆంధ్రుల హక్కు’ అని ఉభయ రాష్ట్రాల ప్రజలు పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని 100 శాతం అమ్మేయడానికి నిర్ణయించింది. స్టీల్‌ప్లాంటు ఏర్పాటు చేసినప్పటి నుంచి సొంత గనులు ఇవ్వాలని కోరుతుంటే...పాలకులు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ఇప్పుడు నష్టాల్లో వుందనే వంకతో అమ్మేస్తున్నారు. ఈ విధంగా ‘విశాఖ ఉక్కు’ అనే పదాన్ని చరిత్ర పుటల్లో కలిపేయడానికి నిర్ణయించారు. దీనిపై ఎవరెన్ని సూచనలు చేసినా, ఎంత చెబుతున్నా ప్రధాని సహా, కేంద్ర మంత్రులు ఎవరూ వెనకడుగు వేయడం లేదు. నిలదొక్కుకోవడానికి సాయం చేస్తామని చెప్పడం లేదు. ఇదే సమయంలో పుండు మీద కారం చల్లినట్టుగా కేంద్ర మంత్రులు వ్యవహరిస్తున్నారు. తాజాగా పార్లమెంటులో టీడీపీ ఎంపీ కనకమేడల...విశాఖపట్నం కేంద్రంగా వాల్తేరు డివిజన్‌పై ప్రశ్నిస్తే...రైల్వే శాఖా మంత్రి పియూష్‌ గోయల్‌ నిర్మొహమాటంగా వాల్తేరు డివిజన్‌ చరిత్ర అంతమైపోయినట్టేనని, ఆ స్థానంలో కొత్తగా రాయగడ డివిజన్‌ వస్తుందని ప్రకటించారు.


125 ఏళ్ల చరిత్ర


విశాఖ కేంద్రంగా వాల్తేరు డివిజన్‌ 125 ఏళ్లుగా కొనసాగుతోంది. దేశంలో రైల్వేకు అత్యధిక ఆదాయం సమకూర్చే తొలి ఐదు డివిజన్లలో వాల్తేరు కూడా ఒకటి. ఏడాదికి సగటున రూ.7 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఇక్కడ లోకోషెడ్‌, వ్యాగన్‌ వర్క్‌షాపు, కంటెయినర్‌ టెర్మినల్‌, రైల్వే ఆస్పత్రి, స్టాఫ్‌ క్వార్టర్లు అన్నీ ఉన్నాయి. అందుకే విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటుచేయాలని ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా డిమాండ్‌ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం 2019 ఎన్నికల ముందు విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా జోన్‌’ ఏర్పాటుచేస్తామని ప్రకటించింది. అందులో విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్లు వుంటాయని ప్రకటించింది. 125 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్‌ను పూర్తిగా రద్దు చేసి అందులో కొన్ని ప్రాంతాలను విజయవాడ డివిజన్‌లో కలిపి, మరికొన్ని ప్రాంతాలను తూర్పు కోస్తా రైల్వేలో కొత్తగా ఏర్పాటుచేసే రాయగడ డివిజన్‌లో కలుపుతామని ప్రకటించింది. దీనిని ఎంపీలు అంతా వ్యతిరేకించారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. వాల్తేరు డివిజన్‌ను యథాతథంగా కొనసాగించాలని కోరింది. దీనికి కేంద్రం పరిశీలిస్తామని కూడా చెప్పలేదు. పోనీ ప్రకటించిన జోన్‌ ఏర్పాటుచేశారా?...అంటే అదీ లేదు. ఇంకా డీపీఆర్‌ పరిశీలనలోనే వుందని చెబుతున్నారు. మరోవైపు వాల్తేరు డివిజన్‌ని మరిచిపోండి...అని చెబుతున్నారు. దేశభక్తి, చరిత్ర, వారసత్వం అంటూ గొప్పలు చెప్పే బీజేపీ నాయకులకు...విశాఖ ఉక్కు కర్మాగారం, వాల్తేరు డివిజన్‌ చరిత్రగా కనిపించడం లేదా?, వాటిని సంరక్షించుకోవలసిన అవసరం లేదా? అని విశాఖ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాటి ఉనికే లేకుండా చేస్తామంటుంటే చూస్తూ ఊరుకోవలసిందేనా?...అంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 22 మంది ఎంపీలున్న వైసీపీ వీటిపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలతో కేంద్రం ఆటలాడుతోందని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని ఉత్తరాంధ్ర రక్షణ వేదిక కన్వీనర్‌ శివశంకర్‌ హెచ్చరించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని, వాల్తేరు రైల్వే డివిజన్‌నూ కొనసాగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-03-21T06:31:09+05:30 IST