ఉక్కు పోరాటం ఢిల్లీ పెద్దల చెవుల్లో మారుమోగాలి

ABN , First Publish Date - 2021-03-21T06:27:27+05:30 IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరిగితే దాన్నే నమ్ముకున్న వేలాది కుటుంబాలు ఎలా బతకాలని ఉక్కు ఏఐటీయూసీ ఉపాధ్యక్షుడు జె.రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

ఉక్కు పోరాటం ఢిల్లీ పెద్దల చెవుల్లో మారుమోగాలి
రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న ఉక్కు ఉద్యోగులు

37వ రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు

కూర్మన్నపాలెం, మార్చి 20: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరిగితే దాన్నే నమ్ముకున్న వేలాది కుటుంబాలు ఎలా బతకాలని ఉక్కు ఏఐటీయూసీ ఉపాధ్యక్షుడు జె.రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు అంతా గొంతెత్తి ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు నిరసనగా కూర్మన్నపాలెంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ  నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరం 37వ రోజు కొనసాగింది. శనివారం ఎంఎంఎస్‌ఎం, ఎస్‌టీఎం, డబ్ల్యూఆర్‌ఎం-2 విభాగాలకు చెందిన కార్మికులు నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని ఆరోపించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఓబులేశు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రక్రియను ఉపసంహరించుకునే వరకు కార్మికుల పోరాటం ఆగదన్నారు. రైల్వేలు, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఉక్కు కర్మాగారాలు, బ్యాంకులు ఇలా అన్నీ అమ్ముకుంటూ పోతే ఏమి మిగులుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ పేరుతో జరుగుతున్న ఈ దోపిడీని అరికట్టాలని, ఈ పోరాటం ఢిల్లీ వారి చెవుల్లో మారుమోగాలన్నారు.     మాదారం డోలమైట్స్‌ మైన్స్‌(ఖమ్మం) నుంచి వచ్చిన ఉద్యోగులు ఉక్కు కార్మికులకు సంఘీభావం తెలిపారు. మాదారం డోలమైట్స్‌ మైన్స్‌ కార్మిక నేత శ్రీరాములు మాట్లాడుతూ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.  బీజేపీ ప్రభుత్వం కారుచౌకగా ప్రజా సంపదను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెడుతున్నదన్నారు.  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు  జె.అయోధ్యరామ్‌, కేఎస్‌ఎన్‌ రావు, దేముడు, ఆనంద్‌,, టి.మోహన్‌ కుమార్‌, వైటీ దాస్‌, జె.సింహాచలం, బోసుబాబు, రామచంద్రరావు, మస్తానప్ప, గంధం వెంకటరావు, బొడ్డు పైడిరాజు, రమణారెడ్డి, సన్యాసిరావు, గణపతి రెడ్డి, విళ్ల రామ్మోహన్‌ కుమార్‌, వరసాల శ్రీనివాసరావు, దొమ్మేటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-21T06:27:27+05:30 IST