ప్రభుత్వరంగ సంస్థల నిర్వీర్యం తగదు

ABN , First Publish Date - 2021-05-03T03:56:29+05:30 IST

ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేయడం కేంద్ర ప్రభుత్వానికి తగదని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ అన్నారు.

ప్రభుత్వరంగ సంస్థల నిర్వీర్యం తగదు
దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న జె.అయోధ్యరామ్‌

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ 

80వ రోజు కొనసాగిన ఉక్కు ఉద్యోగుల దీక్షలు

కూర్మన్నపాలెం, మే 2: ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేయడం కేంద్ర ప్రభుత్వానికి తగదని  ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 80వ రోజు కూడా కొనసాగాయి.  ఆదివారం ఈ దీక్షలలో ఎల్‌ఎంఎంఎం, డబ్ల్యూఆర్‌ఎం, ఆర్‌ఎస్‌ అండ్‌ ఆర్‌ఎస్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ దీక్షా శిబిరంలో పాల్గొన్న అయోధ్యరామ్‌ మాట్లాడుతూ  కొవిడ్‌ మొదటి దశలో 19 మంది ఉక్కు ఉద్యోగులు మృతి చెందారని, రెండవ దశలో ఇప్పటికే 20 మందిని కోల్పోయామని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వాలు కొవిడ్‌ నియంత్రణ చర్యలపై దృష్టి సారించాలని కోరారు. దేశంలో ప్రభుత్వరంగ స్టీల్‌ పరిశ్రమలు ప్రజలకు కొంతమేర ఆక్సిజన్‌ను అందించి ప్రాణాలు కాపాడటంలో ముఖ్య భూమికను పోషించాయన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఆసుపత్రి సేవలను మరింత మెరుగుపరిచేందుకు స్టీల్‌ యాజమాన్యం చర్యలు చేపట్టాలని  కోరారు. ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్న ఉద్యోగులు అందరికీ వ్యాక్సిన్‌ అందించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ఈ శిబిరంలో పరిరక్షణ కమిటీ నాయకులు కె.సత్యనారాయణ, బి.మురళీ రాజు, అప్పలరాజు, ప్రసాద్‌, వెంకటేశ్వర్లు, బాలశౌరి, మురళి, రవి, రాజు, త్రినాథ్‌, మూర్తి, ఈశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-03T03:56:29+05:30 IST