ప్రభుత్వ విధానాల వల్లనే స్టీల్‌ప్లాంట్‌కు అప్పుల భారం

ABN , First Publish Date - 2021-03-22T05:53:03+05:30 IST

కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లనే ఉక్కు కర్మాగారానికి అప్పుల భారం ఏర్పడిందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడు గంధం వెంకటరావు అన్నారు.

ప్రభుత్వ విధానాల వల్లనే స్టీల్‌ప్లాంట్‌కు అప్పుల భారం
రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఉక్కు రిటైర్డు ఉద్యోగులు

విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నేతల ఆరోపణ

38వ రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు

కూర్మన్నపాలెం, మార్చి 21: కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లనే ఉక్కు కర్మాగారానికి అప్పుల భారం ఏర్పడిందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడు గంధం వెంకటరావు అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ 38 రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఆదివారం నిరాహార దీక్షలో ఉక్కు రిటైర్డు కార్మికులు, ఉద్యోగులు  కూర్చున్నారు. ఈ సందర్భంగా గంధం వెంకటరావు మాట్లాడుతూ మోదీ పాలనలో ప్రభుత్వరంగాన్ని మరింత బలహీనపరుస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన విధానాలు మార్చుకోక పోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇంటక్‌ సేఫ్టీ కమిటీ సభ్యుడు జగదీశ్‌ కుమార్‌ మాట్లాడుతూ విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించకుండా అప్పుల ఊబిలోకి నెట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేటీకరించడం అత్యంత దుర్మార్గమన్నారు. తక్షణమే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.  రిటైర్డు ఉక్కు ఉద్యోగి మాటూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకోవటానికి ఎంతటి త్యాగాలకైనా వెనుకాడేది లేదన్నారు. హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రామారావు మాట్లాడుతూ ఉక్కు కార్మికులు చేస్తున్న పోరాటాల వల్లనే రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందని, ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసే దిశగా కార్యాచరణ రూపొందించాలని అన్నారు.  కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు జె.అయోధ్యరామ్‌, మంత్రి రాజశేఖర్‌, వైటీ దాస్‌, జె.సింహాచలం, బోసుబాబు, రామచంద్రరావు, మస్తానప్ప, గంధం వెంకటరావు, బొడ్డు పైడిరాజు, దాడి శివరాం,  సన్యాసిరావు, అప్పాజీరావు, ఆనంద్‌, వెంకటరావు, నారాయణరావు, బాల భాస్కర్‌, రంగారెడ్డి, మాధవరావు, శరత్‌ కుమార్‌,  తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-22T05:53:03+05:30 IST