మతిస్థిమితంలేని మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-13T05:11:35+05:30 IST

మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఒక మహిళ... చీమల మందును నీటిలో కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకుందని ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌ తెలిపారు.

మతిస్థిమితంలేని మహిళ ఆత్మహత్య
ఆత్మహత్య చేసుకున్న నడిగట్ల మంగ

చీమల మందును నీటిలో కలుపుకుని తాగిన వైనం


కోటవురట్ల, జనవరి 12: మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఒక మహిళ... చీమల మందును నీటిలో కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకుందని ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌ తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం... మండలంలోని కైలాసపట్నం గ్రామానికి చెందిన నడిగట్ల మంగ(45)కు ఎనిమిదేళ్ల నుంచి మానసిక పరిస్థితి సరిగా లేదు. దీంతో ఇటీవల మధుమేహ సమస్య కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం చీమల మందును నీటిలో కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అనంతరం ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. కుటుంబ సభ్యులు వెంటనే కోటవురట్ల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తుండగా ప్రాణాలు వదిలింది. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


బైక్‌ను ఢీకొన్న లారీ... వ్యక్తి మృతి

ఎలమంచిలి రూరల్‌, జనవరి 12: మండలంలోని రేగుపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందినట్టు రూరల్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు. కొత్తలి గ్రామానికి చెందిన కాళ్ల రాజా (46) ఎలమంచిలి రామ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. స్వగ్రామంలోని పొలాల్లో పనులు చూసుకోవడానికి మంగళవారం ఉదయం బైక్‌పై వెళ్లాడు. తిరిగి ఎలమంచిలి వెళుతుండగా రేగుపాలెం వద్ద లారీ ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన రాజా అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.


పెట్రోల్‌ బంకులో లారీ ఢీకొని పారిశుధ్య కార్మికుడు మృతి

కశింకోట: మండలంలోని ఉగ్గినపాలెంలో ఉన్న ఒక పెట్రోల్‌ బంకులో లారీ ఢీకొనడంతో పారిశుధ్య కార్మికుడు మృతిచెందాడు. పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. కశింకోట రెల్లివీధికి చెందిన బంగారు నూకరాజు (70) ఉగ్గినపాలెం సీఎస్‌ఎన్‌ మూర్తి పెట్రోల్‌ బంకులో పారిశుధ్య కార్మికునిగా పనిచేస్తున్నాడు. మంగళవారం బంకు ఆవరణను శుభ్రం చేస్తుండగా... ఆయిల్‌ కోసం వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో నూకరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఎల్‌.సురేశ్‌కుమార్‌ చెప్పారు.


భార్య వేధింపులతోనే రమేశ్‌ ఆత్మహత్య

పాయకరావుపేట: మండలంలోని అరట్లకోటలో గోరింట్ల రమేశ్‌ (42) ఆత్మహత్య చేసుకోవడానికి అతని భార్య వేధింపులే కారణమంటూ మృతుడికి వరుసకు తమ్ముడు అయిన పల్లి శేఖర్‌ ఫిర్యాదు చేశాడని ఎస్‌ఐ డి.దీనబంధు తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... రమేశ్‌ను భార్య అప్పలనర్స సరిగా చూడకపోగా, భోజనం కూడా పెట్టేది కాదన్నారు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. దీనిపై విచారణ చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.


పాల్తేరు రామాలయంలో హుండీ అపహరణ

పాయకరావుపేట రూరల్‌: మండలంలోని పాల్తేరు రామాలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు హుండీని అపహరించుకుపోయారు. మంగళవారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు వచ్చి పరిశీలించారు. కాగా ఎస్‌.నర్సాపురం వెళ్లే రోడ్డు పక్కన తుప్పల్లో ఖాళీ హుండీని గ్రామస్థులు గుర్తించారు. ఆలయాన్ని నిర్మించి సుమారు 50  ఏళ్లు అవుతున్నదని, ఇంతవరకు ఇటువంటి సంఘటన జరగలేదని అన్నారు.


80 లీటర్ల సారాతో ఆరుగురి అరెస్టు

రావికమతం: మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆరుగురిని అరెస్టు చేసి, 80 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్టు రావికమతం, కొత్తకోట ఎస్‌ఐలు ఎ.సూర్యనారాయణ, డి.నాగకార్తీక్‌ తెలిపారు. బుచ్చెయ్యపేట మండలం గంటికొర్లాం నుంచి క్యాన్లలో 40 లీటర్ల నాటుసారా తీసుకువస్తున్న ఇద్దరిని రావికమతం శివారులో పట్టుకుని అరెస్టు చేశారు. కొట్నాబిల్లి నుంచి 20 లీటర్ల సారా తెస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆర్‌.దిబ్బలపాలేనికి చెందిన ముగ్గురిని 20 లీటర్ల సారాతో పట్టుకుని అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిచారు.


కోడిపందాలపై దాడి.... ఆరుగురి అరెస్టు 

మాకవరపాలెం: మండలంలోని భీమబోయినపాలెంలో కోడి పందేలు నిర్వహిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు దాడి చేసి ఆరుగురిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ కరక రాము తెలిపారు. ఆరు కోడిపుంజులు, రు.1,500 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.


Updated Date - 2021-01-13T05:11:35+05:30 IST