విశాఖ ఉక్కు జోలికివస్తే సహించం

ABN , First Publish Date - 2021-03-21T06:30:35+05:30 IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించేకునేందుకు ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ జె.అయోధ్యరామ్‌ అన్నారు.

విశాఖ ఉక్కు జోలికివస్తే సహించం
సెల్‌ఫోన్‌ల వెలుగులో కార్మికులు

ఉక్కు కార్మిక గర్జనలో నేతల ఉద్ఘాటన

ఉక్కుటౌన్‌షిప్‌, మార్చి 20: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించేకునేందుకు ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ జె.అయోధ్యరామ్‌ అన్నారు. తృష్ణా మైదానంలో శనివారం జరిగిన ఉక్కు కార్మిక గర్జనలో ఆయన మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌ పోరాటాలతో ఏర్పడిందని, ఇటువంటి ప్లాంట్‌ను కాపాడుకునేందుకు అందరి సహకారం అవసరమని అన్నారు. ప్లాంట్‌ జోలికి వస్తే సహించేది లేదని, ప్లాంట్‌కు ప్రభుత్వం కేవలం రూ.4890 కోట్లు మాత్రమే పెట్టిందని, అయితే ఇప్పటివరకు వివిధ పన్నుల రూపేణా రూ.45 వేల కోట్లను చెల్లించామన్నారు. మరో చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నేడు ప్రగతి పథంలో పయనిస్తున్న స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. జాతి సంపదను కార్పొరేట్‌లకు అప్పగించేందుకు మోదీ చూస్తున్నారన్నారు.  సొంత ప్లాంట్‌లు లేని సంస్థలకు సొంత గనులు ఇచ్చిన ప్రభుత్వం ప్రగతి పథంలో ఉన్న ప్లాంట్‌కు ఎందుకు సొంత గనులు ఇవ్వలేదని ప్రశ్నించారు. మరో ఛైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ నాడు బీఐఎఫ్‌ఆర్‌కు వెళ్లినప్పుడు కూడా భయపడలేదని, ప్లాంట్‌ను కాపాడుకునేందుకు పోరాటాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. నిర్వాసితులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సభలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు పరమట సత్యనారాయణ, బి.లాలు, వైటీ దాసు, గంధం వెంకటరావు, జి.బోసుబాబు, కెఎస్‌ఎన్‌.రావు, డి.అప్పారావు, వై.మస్తానప్ప, బొడ్డు పైడిరాజు, డి.సురేశ్‌బాబు, వరసాల శ్రీనివాసరావు, డేవిడ్‌, బి.మురళీరాజు, నీరుకొండ రామచంద్రరావు, డివీ.రమణారెడ్డి, అవతారం, వి.ప్రసాద్‌, గంగవరం గోపి పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-21T06:30:35+05:30 IST