ప్రాణం తీసిన బెట్టింగ్‌

ABN , First Publish Date - 2021-12-31T06:26:12+05:30 IST

క్రికెట్‌ బెట్టింగ్‌లో డబ్బులు పోయి, అప్పుల పాలుకావడంతో పాడేరు పట్టణానికి చెందిన మర్ల జయవర్మ (26) ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రాణం తీసిన బెట్టింగ్‌
జయవర్మ(ఫైల్‌ఫొటో)


అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న యువకుడు  

పాడేరు రూరల్‌, డిసెంబరు 30: క్రికెట్‌ బెట్టింగ్‌లో డబ్బులు పోయి, అప్పుల పాలుకావడంతో పాడేరు పట్టణానికి చెందిన మర్ల జయవర్మ (26) ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి. పాడేరు నీలకంఠానగర్‌కు చెందిన జయవర్మకు రెండేళ్ల క్రితం వివాహమైంది. ఇటీవల పెదబయలులో బట్టల దుకాణం, నూడిల్స్‌ షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇదిలావుండగా పాడేరు మెయిన్‌రోడ్డులో గల ఒక ప్రైవేటు నెట్‌వర్క్‌ యజమాని ద్వారా జరిగిన క్రికెట్‌ బెట్టింగ్‌లో జయవర్మ రూ.ఏడు లక్షల వరకు నష్టపోయాడు. గత నెలలో రూ.మూడు లక్షలు కట్టగా, మిగిలిన రూ.నాలుగు లక్షలు తక్షణమే చెల్లించాలని నెట్‌వర్క్‌ యజమాని ఒత్తిడి పెంచాడు. దీంతో నెలకు రూ.40 వేలు చొప్పున చెల్లిస్తామని 20 రోజుల క్రితం భార్యాభర్తలు నోటు రాసి ఇచ్చారు. అయితే జనవరి రెండో తేదీకి డబ్బులు పూర్తిగా చెల్లించకుంటే ఇంటిని స్వాధీనం చేసుకోవాల్సి వుంటుందని సదరు నెట్‌వర్క్‌ యజమాని హెచ్చరించాడు. దీంతో జయవర్మ ఒత్తిడి తట్టుకోలేక బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడని అతని భార్య ప్రియాంక కన్నీరుమున్నీరయ్యింది. ఇదే విషయాన్ని బుధవారం రాత్రి పాడేరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు భార్యతోపాటు కుటుంబ సభ్యులు తెలిపారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జయవర్మ మృతదేహానికి గురువారం పోస్టుమార్టం నిర్వహించినట్టు ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపారు. 

Updated Date - 2021-12-31T06:26:12+05:30 IST