ధర్మ ప్రచార నిధి ఏర్పాటు కావాలి- స్వరూపానందేంద్ర

ABN , First Publish Date - 2021-10-20T01:57:19+05:30 IST

వైజాగ్: ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ శాఖ ప్రత్యేకంగా ధర్మ ప్రచార నిధిని ఏర్పాటు చేసుకోవాలని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సూచించారు.

ధర్మ ప్రచార నిధి ఏర్పాటు కావాలి- స్వరూపానందేంద్ర

వైజాగ్: ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ శాఖ ప్రత్యేకంగా ధర్మ ప్రచార నిధిని ఏర్పాటు చేసుకోవాలని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సూచించారు. వాడవాడలా హిందూ ధర్మ ప్రచారం సాగేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. శాఖాపరంగా ధర్మ ప్రచారం చేపడితే సత్ఫలితాలు సాధించవచ్చని దేవాదాయ శాఖకు సూచించారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ సెక్రటరీ వాణీ మోహన్, కమిషనర్ హరి జవహర్ విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వాములతో చర్చించారు. 


ఆలయాల భద్రత కోసం నియమించిన ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి పోలీసు శాఖ ద్వారా శిక్షణను ఇప్పించాలని స్వరూపానందేంద్ర  సూచించారు. దేవాదాయ శాఖలో లోపాల కారణంగా ఆలయాల్లో ఎదురవుతున్న అనేక సమస్యలను ఆయన అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఆలయ వ్యవస్థలో పరిపాలనా పరమైన లోపాలను సరిదిద్దుకోవడానికి ఉద్యోగస్తుల సంఖ్యను పెంచుకోవాలని సూచించారు. ప్రధాన దేవాలయాల ప్రచార రధాలకు మరమ్మతులు చేయించి, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా హిందూ ధర్మ ప్రచారం నిర్వహించాలన్నారు. శాఖాపరంగా హిందూ ధర్మ ప్రచారం చేపట్టడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. ధర్మ ప్రచారం కోసం విశాఖ శ్రీ శారదాపీఠం పెద్ద ఎత్తున కసరత్తులు చేపట్టిందని,  ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని వివరించారు. హిందూ ధర్మ ప్రచారాన్ని కులాలకు అతీతంగా చేపట్టేందుకు వీలుగా ఆ ప్రణాళిక ఉంటుందన్నారు. దేవాలయ సాహిత్యం, కవీశ్వరుల రచనలను వెలుగులోకి తీసుకురావాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు స్వరూపానందేంద్ర స్వామి సూచించారు. పురాణ సభలను ఏర్పాటు చేసి, ఎంపిక చేసిన పండితుల ద్వారా ఆలయాల చరిత్ర, స్థల పురాణం, దేవతామూర్తుల మహిమలను పుస్తకరూపంలో తీసుకు రావాలన్నారు. త్వరితగతిన ఆగమ సలహామండలి ఏర్పాటు చేయాలని, ఆలయాల్లో అర్చనా విధులు, కైంకర్యాల విషయంలో తలెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. దేవాలయ పరిపాలనా సంస్థ ద్వారా ధర్మకర్తల మండళ్ళు, ఆలయాధికారులకు అవగాహన, శిక్షణ తరగతులను నిర్వహించాలని సూచించారు. విశాఖ శ్రీ శారదాపీఠం త్వరలో చేపట్టబోయే అర్చక సమ్మేళనం, సింహాచలం పంచ గ్రామాల సమస్య తదితర అంశాలపై అధికారులతో స్వరూపానందేంద్ర స్వామి చర్చించారు. స్వామీజీ చర్చించిన అంశాలపై దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ మోహన్, కమిషనర్ హరి జవహర్ సానుకూలంగా స్పందించారు. త్వరితగతిన పరిష్కరిస్తామని విన్నవించారు. 

Updated Date - 2021-10-20T01:57:19+05:30 IST