విజయరామరాజుపేట పాల సంఘ ఎన్నికపై రగడ
ABN , First Publish Date - 2021-07-02T05:50:21+05:30 IST
విజయరామరాజుపేట విశాఖ డెయిరీ పాల సంఘం అధ్యక్ష ఎన్నికపై వివాదం నెలకొంది.
అధ్యక్షుడిగా వెంకటరావు ప్రకటనపై అభ్యంతరం
విశాఖ డెయిరీకి కాకుండా ప్రైవేటుగా పాలు విక్రయం
బుచ్చెయ్యపేట, జూలై 1: విజయరామరాజుపేట విశాఖ డెయిరీ పాల సంఘం అధ్యక్ష ఎన్నికపై వివాదం నెలకొంది. అధ్యక్షుడిగా మళ్ల వెంకటరావును ప్రకటించడంపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు దఫాలుగా పనిచేసిన వ్యక్తిని, ఎన్నిక నిర్వహించకుండా మూడోసారి కూడా ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని వారు మండిపడ్డారు. సిబ్బందిని సంఘం భవనంలోకి రాకుండా అడ్డుకున్నారు. అలాగే పాలును విశాఖ డెయిరీకి కాకుండా ప్రవేటు డెయిరీకి పంపిస్తున్నారు. విషయం తెలుసుకున్న డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ గురువారం రైతులతో సమావేశమై వివాదానికి కారణాలు తెలుసుకున్నారు. రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేసిన వెంకటరావుతో కుమ్మకైన పీఎస్ ప్రసాద్, బోనస్ కోసం తీసుకున్న తమ సంతకాలతో దొడ్డిదారిన ఎన్నికకు సహకరించారని రైతులు ఆరోపించారు. వెంకటరావు అధ్యక్షుడిగా అంగీకరించేది లేదని తెగేసి చేప్పారు. దీనికి సహకారం అందించిన సిబ్బందిని తక్షణమే బదిలీ చేయాలని, వెంకటరావును పదవి నుంచి తొలగించి తిరిగి ఎన్నిక నిర్వహించాలని పట్టుబడ్డారు. డెయిరీ వైస్ చైర్మన్ ఆడారి ఆనంద్‌కుమార్ దృష్టికి తీసుకువెళ్లి అధ్యక్ష ఎన్నిక వివాదం పరిష్కారానికి కృషి చేస్తానని సత్యనారాయణ హమీ ఇచ్చారు. సమావేశంలో సర్పంచ్ విజయకుమార్, మాజీ సర్పంచ్ కిశోర్ పాల్గొన్నారు.