వేట సాగదు! పూట గడవదు!!
ABN , First Publish Date - 2021-09-03T06:28:10+05:30 IST
సంద్రాన్నే నమ్ముకుని...రెక్కల కష్టమే పెట్టుబడిగా...జీవనం సాగిస్తున్న మత్స్యకారుల జీవితాల్లో అభివృద్ధి మచ్చుకు కూడా కానరావడం లేదు. తరాలు మారుతున్నా..వారి తలరాతలు ఏమాత్రం మారడం లేదు.

మారని సంప్రదాయ మత్స్యకారుల బతుకులు
అనేక సమస్యలు
ప్రకృతి వైపరీత్యాలు పెరగడం, వేటకు వెళ్లే రోజుల సంఖ్య, కాలుష్యం వల్ల మత్స్య సంపద తగ్గిపోవడం ప్రధానమైనవి
చేపలు దూర ప్రాంతాలకు వలస వెళ్లిపోవడం,అవసరం లేని చేపలు దొరకడం....
సుస్థిర అభివృద్ధికి తొమ్మిది ప్రత్యామ్నాయ మార్గాలు
ఏయూ విద్యార్థి పరిశోధనలో వెల్లడి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
సంద్రాన్నే నమ్ముకుని...రెక్కల కష్టమే పెట్టుబడిగా...జీవనం సాగిస్తున్న మత్స్యకారుల జీవితాల్లో అభివృద్ధి మచ్చుకు కూడా కానరావడం లేదు. తరాలు మారుతున్నా..వారి తలరాతలు ఏమాత్రం మారడం లేదు. నగరానికి చెందిన పసల ఈశ్వరరావు ‘విశాఖలో మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల అభివృద్ధిని కోల్పోతున్న మత్స్యకారులు-సుస్థిర అభివృద్ధి సాధించేందుకు ప్రత్యామ్నాయ జీవన విధానాలు’ అనే అంశంపై నాలుగేళ్లపాటు పరిశోధన చేశారు. కొద్దిరోజుల కిందట పీహెచ్‌డీ తీసుకున్నారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధి సాధించేందుకు ఆయన సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలపై కథనం...
మత్స్యకారుల జీవన స్థితిగతులను తెలుసుకునేందుకు గాను ఈశ్వరరావు 2013 నుంచి 2017 వరకు పరిశోధన సాగించారు. పరిశోధనలో భాగంగా జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలను మూడు విభాగాలు చేసి, ఒక్కో విభాగం నుంచి ఐదు ప్రాంతాలను ఎంపిక చేసుకున్నారు. ఆయా ప్రాంతాల్లోని మత్స్యకారులు, మత్స్యకార సంఘ నాయకులు, ప్రతినిధులు, మత్స్య శాఖ అధికారులను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి గల కారణాలు, ఆర్థిక ఇబ్బందులు గురించి తెలుసుకున్నారు.
ఈ ప్రాంతాల్లో పరిశోధన..
గ్రామీణ ప్రాంతంలో గంగవరం, పెంటకోట, తొత్తడి, పూడిమడక, అప్పికొండ, నగర పరిధిలో పెదజాలారిపేట, అప్పుఘర్, వాసవానిపాలెం, జోడుగుళ్లపాలెం, నగర ప్రభావముండే (సబర్బన్ ఫిషింగ్ కమ్యూనిటీ) రుషికొండ, తిమ్మాపురం, మంగమారిపేట, ఉప్పాడ, భీమిలి ప్రాంతాల్లో ఇంటింటి సర్వే, సమావేశాలు నిర్వహించి వేటలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆర్థిక సమస్యలకు గల కారణాలను తెలుసుకుని విశ్లేషించారు.
గుర్తించిన సమస్యలు..
మత్స్యకారులు ఆర్థికంగా సుస్థిరాభివృద్ధి సాధించకపోవడానికి ప్రధానంగా నాలుగు కేటగిరీల్లో 53 సమస్యలను గుర్తించారు. వీటిలో ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాలు పెరగడం, వేటకు వెళ్లే రోజుల సంఖ్య తగ్గడం, సముద్ర ఉష్ణోగ్రతలు తగ్గడం, కాలుష్యం వల్ల మత్స్య సంపద తగ్గిపోవడం, తీరం కోతకు గురికావడం, సముద్ర కరెంట్ మారడం, చేపలు దూర ప్రాంతాలకు వలస వెళ్లిపోవడం, అవసరం లేని చేపలు దొరకడం, నాణ్యత తగ్గడం, శ్రమకు తగ్గ ఫలితం దక్కకపోవడం, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ కావడంతో మత్స్యకారులు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఈ తరహా ఇబ్బందుల వల్ల కొంతమంది సుస్థిరం కాని ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించి ఇబ్బందులు పడుతున్నట్టు పరిశోధనలో గుర్తించారు. వేట వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతోమంది నిబంధనలకు విరుద్ధంగా చిన్న సైజు వలతో వేటకు వెళ్లడం, సాధారణ బోట్లు కాకుండా టెక్నాలజీతో కూడిన బోట్లను వాడడం (డీజిల్‌తో ఆర్థికంగా భారం), కొందరు పూర్తిగా వృత్తిని వదిలి ఇతర పనుల్లోకి వెళ్లడం, కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోవడం వంటివి చేస్తున్నారు.
సుస్థిర అభివృద్ధికి ప్రత్యామ్నాయ మార్గాలు
పరిశోధనలో భాగంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఈశ్వరరావు వాటి నుంచి బయటపడంతోపాటు ఆర్థికంగా వృద్ధి చెందేందుకు తొమ్మిది ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ఇందులో రిస్క్ తక్కువగా వుంటుందని ఆయన పేర్కొంటున్నారు. ఆ తొమ్మిది మార్గాలు ఇలా ఉన్నాయి. వృత్తి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, చిన్నతరహా బూడిద ఆధారిత పరిశ్రమలు, పర్యావరణ సహిత మారీకల్చర్, సముద్రపు కలుపు పెంచడం, తీర ప్రాంతంలో అడవుల పెంపకం ద్వారా జీవనోపాధి అభివృద్ధి, అలంకార చేపల పెంపకం, సంఘం ఆధారిత, పర్యావరణ హిత పర్యాటకం, సముద్ర చేపల ఆధారిత సూక్ష్మ సంస్థల ఏర్పాటు, పడవలకు డీజిల్ వంటివి ఉపయోగించడం వల్ల కంటే..సోలార్, విండ్ ఎనర్జీని వినియోగించడం ద్వారా ఖర్చు తగ్గించుకోవడం, పుట్టగొడుగుల పెంపకం ద్వారా మత్స్యకారులు ఆదాయం పెంచుకునేందుకు అవకాశముంది.
పరిశోధనకు నిధులు..
ఐక్యరాజ్య సమితి అభివృద్ధి ప్రణాళిక, బోర్డు ఆఫ్ రీసెర్చ్ ఇన్ న్యూక్లియర్ సైన్సెస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ అనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, లాల్ బహుదూర్‌శాస్ర్తి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ర్టేషన్ మస్సూరీ నుంచి వచ్చిన నిధులతో ఈ పరిశోధనను నిర్వహించినట్టు ఈశ్వరరావు తెలిపారు. ఈ పరిశోధనకు ఏయూ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ టి.బైరాగిరెడ్డి గైడ్‌గా, ప్రొఫెసర్ ఈయూబీ రెడ్డి జాయింట్ రీసెర్చ్ గైడ్‌గా వ్యవహరించారు.