గుండెపోటుతో వ్యాన్ డ్రైవర్ మృతి
ABN , First Publish Date - 2021-03-22T04:41:00+05:30 IST
విజయవాడ నుంచి ఏసీలు, ఫ్రిజ్ ప్యానళ్ల లోడ్‌తో మినీ వ్యాన్‌లో వచ్చిన ఓ డ్రైవర్ గుండెపోటుతో ఆదివారం మధ్యాహ్నం ఆ వాహనంలోనే మృతి చెందాడు.

వాహనం నడుపుతూ కుప్పకూలిన వైనం
మృతుడు కృష్ణా జిల్లా నాగాయలంక వాసి
మల్కాపురం, మార్చి 21 : విజయవాడ నుంచి ఏసీలు, ఫ్రిజ్ ప్యానళ్ల లోడ్‌తో మినీ వ్యాన్‌లో వచ్చిన ఓ డ్రైవర్ గుండెపోటుతో ఆదివారం మధ్యాహ్నం ఆ వాహనంలోనే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన తంబినేని రామకృష్ణ(42) అనే డ్రైవర్ విజయవాడ నుంచి ఏసీలు, ఫ్రిజ్ ప్యానళ్లను తీసుకుని శనివారం రాత్రి విశాఖలోని రామ్‌నగర్‌కు వచ్చాడు. అక్కడ కొంత సరకు దిగుమతి చేసి ఆదివారం మధ్యాహ్నం గాజువాకలో మిగిలిన సరకు ఇవ్వడానికి బయలుదేరాడు. సరిగ్గా కోరమాండల్ గేటు వద్దకు వచ్చే సరికి గుండెపోటు రావడంతో వాహనాన్ని నిలిపి స్టీరింగ్‌పైనే కుప్పకూలిపోయాడు. స్థానిక యువకులు ఇది గమనించి అతనిని బతికించే ప్రయత్నం చేశారు. 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో వైద్య సిబ్బంది వచ్చి అతనిని పరిశీలించి అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. సమీపంలోని పోలీస్ అవుట్ పోస్టు సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మల్కాపురం సీఐ దుర్గాప్రసాద్‌కు తెలియజేశారు. మృతునికి వడ్లపూడిలో బంధువులు ఉన్నారని తెలుసుకుని పోలీసులు వారికి కబురు పెట్టారు. వారు వచ్చి మృతదేహాన్ని తీసుకువెళ్లారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని బంధువులు తెలిపారు.