వ్యాక్సిన్‌ నిల్‌

ABN , First Publish Date - 2021-05-02T05:46:31+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ నిల్వలు మరోసారి నిండుకున్నాయి.

వ్యాక్సిన్‌ నిల్‌
దేవరాపల్లి పీహెచ్‌సీలో శనివారం వ్యాక్సిన్‌ కోసం బారులుతీరిన ప్రజలు

జిల్లాలో మరోసారి పూర్తిగా నిండుకున్న నిల్వలు

రెండు రోజుల కిందట 40 వేల డోసుల రాక

రెండో డోసు వ్యాక్సినేషన్‌కు

వినియోగించడంతో ఖాళీ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ నిల్వలు మరోసారి నిండుకున్నాయి. రెండు రోజుల కిందట జిల్లాకు చేరిన 40 వేల డోసుల వ్యాక్సిన్‌ దాదాపు అయిపోయింది. ప్రస్తుతం కొన్నిచోట్ల మినహా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చాలాచోట్ల ఆగిపోయింది. వ్యాక్సిన్‌ కొరత కారణంగానే గత మూడు రోజుల నుంచి అనేక కేంద్రాల వద్ద ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. శనివారం జిల్లాలో 10,898 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు 6,08,978 మందికి వ్యాక్సిన్‌ అందించినట్టయ్యింది. ఆదివారం నుంచి మూడొంతులకు పైగా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ నిలిచిపోనుంది. అతికొద్దచోట్ల మాత్రమే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరగనుంది. జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు వ్యాక్సిన్‌ తీసుకోవాలనుకునే వారిలో ఆందోళన రేకెతిస్తున్నాయి. వ్యాక్సిన్‌ కోసం రోజుల తరబడి కేంద్రాల చుట్టూ తిరుగుతున్నామని, ఇప్పుడు అయిపోతే మళ్లీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందోనని అంటున్నారు. రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకోవాల్సినవారు మరింత ఎక్కువ కంగారుపడుతున్నారు. వ్యాక్సిన్‌ పూర్తిగా అయిపోవడంతో రెండు లక్షల వరకు డోసులు కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా అధికారులు నివేదించారు. ఆదివారం రాత్రికి గానీ, సోమవారం ఉదయానికి గానీ కొంత వచ్చే అవకాశముందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సూర్యనారాయణ ఆశాభావం వ్యక్తంచేశారు. రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడుతున్నామని, వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇటీవల రెండో డోసుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి  కొవాగ్జిన్‌ 50 వేల మందికి, కొవిషీల్డ్‌ 40 వేల మందికి అందించినట్టు ఆయన వెల్లడించారు. ఇకపై, మొదటి, రెండో డోసు వ్యాక్సినేషన్‌ నిరంతరంగా కొనసాగిస్తామన్నారు. 


Updated Date - 2021-05-02T05:46:31+05:30 IST