రూ.500 ఇస్తేనే వ్యాక్సిన్‌!

ABN , First Publish Date - 2021-05-30T05:51:09+05:30 IST

కరోనా రెండో దశ తీవ్ర ప్రభావం చూపడంతో వ్యాక్సిన్‌ కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ఈ కేంద్రాల్లోని కొంతమంది సిబ్బంది దీనిని అవకాశంగా తీసుకుని సొమ్ము చేసుకుంటున్నారు.

రూ.500 ఇస్తేనే వ్యాక్సిన్‌!
ఆరిలోవ ఎఫ్‌ఆర్‌యూని సందర్శించి సిబ్బందిని ప్రశ్నిస్తున్న మేయర్‌ హరికుమారి

ఆరిలోవ ఎఫ్‌ఆర్‌యూలో సిబ్బంది చేతివాటం

మేయర్‌కు ఫిర్యాదు చేసిన బాధితులు

ఆశా వర్కర్‌ సస్పెన్షన్‌

విశాఖపట్నం, మే 29(ఆంధ్రజ్యోతి): కరోనా రెండో దశ తీవ్ర ప్రభావం చూపడంతో వ్యాక్సిన్‌ కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ఈ కేంద్రాల్లోని కొంతమంది సిబ్బంది దీనిని అవకాశంగా తీసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. డబ్బులిస్తేనే టీకా వేస్తామంటూ ప్రజల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు.  ఆరిలోవ ఫస్ట్‌ రిఫరల్‌ యూనిట్‌(ఎఫ్‌ఆర్‌యూ)లో  టీకా వేస్తున్న ఆశా వర్కర్‌ ఒకరు రూ.500 ఇస్తేనే వ్యాక్సిన్‌ వేస్తామని డిమాండ్‌ చేశారంటూ కొంతమంది ఆరోపించారు. డబ్బులు ఇచ్చుకోలేనివారంతా వ్యాక్సిన్‌ వేసుకోకుండానే వెనుదిరిగిపోగా, కొంతమంది డబ్బులు ఇచ్చి వ్యాక్సిన్‌ వేయించుకున్నారంటూ జీవీఎంసీ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారికి ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన మేయర్‌ నేరుగా ఆరిలోవ ఎఫ్‌ఆర్‌యూకి వెళ్లి వ్యాక్సిన్‌ వేస్తున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విచారణకు ఆదేశించారు. ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే జీవీఎంసీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1800 4250 0009 లేదా 0891-2869100కి ఫోన్‌ చేసి తెలపాలని సూచించారు. 

ఆరిలోవ: ఈ విషయమై ఆసుపత్రి వైద్యాధికారిణి డాక్టర్‌ అనితను వివరణ కోరగా ఆశా వర్కర్‌ ఒకరు రూ. ఐదు వందలు తీసుకుని వ్యాక్సిన్‌ వేసినట్టు విచారణలో తేలిందని, ఆమెను సస్పెండ్‌ చేసినట్టు వివరించారు.

Updated Date - 2021-05-30T05:51:09+05:30 IST