సాకారం కాని పర్యాటకం

ABN , First Publish Date - 2021-10-14T05:47:24+05:30 IST

బంగ్లాదేశ్‌ వాణిజ్య నౌక పోర్టు యాంకరేజి నుంచి తెన్నేటి పార్కు తీరానికి కొట్టుకు వచ్చి ఏడాది పూర్తయింది.

సాకారం కాని పర్యాటకం

ఏడాది క్రితం తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్‌ నౌక

ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌గా మారుస్తామంటూ ప్రకటనలు

ఇప్పటికీ కార్యరూపం దాల్చని వైనం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

బంగ్లాదేశ్‌ వాణిజ్య నౌక పోర్టు యాంకరేజి నుంచి తెన్నేటి పార్కు తీరానికి కొట్టుకు వచ్చి ఏడాది పూర్తయింది. దానిని కొనుగోలు చేసి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్న అధికారుల ప్రకటన నేటికీ కార్యరూపం దాల్చలేదు. కురుసుర సబ్‌మెరైన్‌లా, టీయూ-142 యుద్ధ విమానంలా ఆ నౌకను ఒక సందర్శనీయ స్థలంలా మార్చినా ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుంది. కానీ ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు జరగడం లేదు. 


ఎంత శ్రమించినా కదలని నౌక

గత ఏడాది అక్టోబరు 11వ తేదీన అర్ధరాత్రి దాటాక వాయుగుండం ప్రభావంతో వీచిన బలమైన గాలులకు బంగ్లాదేశ్‌కు చెందిన వాణిజ్య నౌక ‘ఎంవీ మా’ తెన్నేటి పార్కు తీరానికి కొట్టుకు వచ్చింది. 80 మీటర్ల పొడవైన నౌక రాళ్ల మధ్య ఇసుకలో చిక్కుకుపోయింది. అందులో 15 మంది సిబ్బంది క్షేమంగానే బయటపడ్డారు. తిరిగి దానిని సముద్రంలోకి పంపడానికి పోర్టు, కోస్టుగార్డు, తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ ప్రయత్నించాయి. కానీ ఏవీ సఫలం కాలేదు. దాంతో అందులో వున్న ఇంధనం వల్ల సముద్ర జలాలు కలుషితం కాకూడదని, రివర్స్‌ పంపింగ్‌ విధానంలో దానిని ట్యాంకర్లలోకి ఎక్కించి తరలించారు. ఆ తరువాత సముద్రం ఆటుపోటు సమయంలో దానికదే వెళ్లిపోతుందని భావించారు. అది సాధ్యం కాదని యజమాని గుర్తించి అందులో విలువైన యంత్ర సామగ్రి తీసుకుపోయి, నౌకను మాత్రం వదిలేశారు. దానిని తుక్కుకు విక్రయించే ప్రయత్నాలు చేశారు. విషయం తెలిసి, పర్యాటక శాఖ అధికారులు ఆ నౌకను తమకు ఇస్తే...ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌గా మారుస్తామని బేరసారాలు చేశారు. అయితే ఎంతకు కొనాలనే విషయమై ఇరువర్గాల మధ్య అవగాహన కుదరలేదు. పర్యాటక శాఖ ఆ తరువాత దీనిని సీరియస్‌గా తీసుకోలేదు. అయితే పర్యాటకులు మాత్రం దానిని ఇప్పటికీ ఆసక్తిగానే తిలకిస్తున్నారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందుల వల్ల దానిని తీసుకునే ఆలోచన లేకపోతే...కనీసం ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించినా విశాఖకు ఒక పర్యాటక ప్రాజెక్టు వచ్చినట్టు అవుతుంది. ఆ దిశగానైనా ప్రయత్నం చేయాల్సి ఉంది.

Updated Date - 2021-10-14T05:47:24+05:30 IST