ఉద్యోగుల పోరుబాట

ABN , First Publish Date - 2021-09-02T06:39:04+05:30 IST

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ (సీపీఎస్‌) విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు బుధవారం జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా వున్న గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించాయి.

ఉద్యోగుల పోరుబాట
గాంధీ విగ్రహం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల ధర్నా

 సీపీఎస్‌ను రద్దు చేయాలి

లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక

జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఫ్యాప్టో, ఏపీసీపీఎస్‌ఈఏ ఆధ్వర్యంలో ధర్నాలు

పాదయాత్రలో ఇచ్చిన హామీని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్‌

‘‘ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లోగా సీపీఎస్‌ను రద్దు చేస్తామన్నారు. రెండున్నరేళ్లు అవుతున్నా...దాని గురించి పట్టించుకోవడమే లేదు. మాట తప్పను, మడమ తిప్పను...అన్న మీ మాట ఏమైందో అర్థం కావడం లేదు. వేలాది మంది ఉద్యోగులు ఏళ్ల తరబడి పోరాటాన్ని సాగిస్తున్నారు. ఇప్పటికైనా సీపీఎస్‌ను రద్దు చేయండి. లేదంటూ భవిష్యత్తులో పెద్దఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతాం’

- ఇదీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల హెచ్చరిక


విశాఖపట్నం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి):  కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ (సీపీఎస్‌) విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు బుధవారం జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా వున్న గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించాయి. ఫ్యాప్టో అనుబంధ సంఘమైన ఏపీసీపీఎస్‌-యూఎస్‌, ఏపీసీపీఎస్‌ఈఏ వేర్వేరుగా ఉదయం 10 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమాల్లో పెద్దఎత్తున ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా వున్నప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏపీఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు మాట్లాడుతూ  ప్రభుత్వ ఉద్యోగుల్లో 90-95 మంది వైసీపీకి ఓట్లేసి గెలిపించారని, అటువంటి వారిని ఇబ్బందిపెట్టడం సమంజసం కాదన్నారు. ఉద్యోగుల్లో వ్యతిరేకత పెరుగుతోందని, ఇప్పటికైనా ఇచ్చిన మాట వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏపీఎన్జీవో నగర అధ్యక్షుడు వై.నారాయణరావు మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేయకుంటే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. ఫ్యాప్టో చైర్మన్‌ ఈ.పైడిరాజు మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దయ్యేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామని చెప్పిన సీఎం రెండున్నరేళ్లు అవుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వెంటన పాత పెన్షన్‌ 

విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీసీపీఎస్‌ఈఏ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల్లో భయం, అభద్రతా భావం పెరిగిపోయాయని, వీటిని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఏపీసీపీఎస్‌ఈఏ అసోసియేషన్‌ విశాఖ జిల్లా అధ్యక్షుడు కోరుకొండ సతీష్‌ మాట్లాడుతూ సీపీఎస్‌ వల్ల ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలో చిక్కుకుందని, ప్రతి ఉద్యోగి తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నారన్నారు. సీపీఎస్‌ రద్దు చేసేంత వరకూ పోరాడతామని, ఈ విషయంలో ప్రాణత్యాగాలకైనా సిద్ధమన్నారు. ధర్నా ప్రాంగణం ఉద్యోగుల నినాదాలతో హోరెత్తింది. ఫ్యాఫ్టో నిర్వహించిన ధర్నాలో కో-చైర్మన్లు కె.శ్రీనివాసు, రామకృష్ణ, టి.అప్పారావు, డీటీఎఫ్‌ మధు, ధర్మేంద్రరెడ్డి, సుధాకర్‌, జిల్లా ఇన్‌చార్జి చందోలు వెంకటేశ్వరరావు, ఏపీసీపీఎస్‌ఈఏ నిర్వహించిన ధర్నాలో రాష్ట్ర కార్యదర్శి ఉమా మహేశ్వరరావు, జనరల్‌ సెక్రటరీ వినయ్‌మోహన్‌, జిల్లా కార్యదర్శి సూర్యప్రకాష్‌, రవిప్రకాష్‌, గోపీనాథ్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-02T06:39:04+05:30 IST