రెండు థియేటర్లు మూత!

ABN , First Publish Date - 2021-12-25T06:37:52+05:30 IST

ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో తాము థియేటర్‌లు నడపలేమంటూ యజమానులు గగ్గోలు పెడుతున్నారు.

రెండు థియేటర్లు మూత!
దేవరాపల్లిలో మూసివేసిన మహేశ్వరీ థియేటర్‌

దేవరాపల్లిలో మహేశ్వరీ, ఎస్‌.రాయవరంలో బాలత్రిపుర సుందరి మూసివేత

ప్రభుత్వం నిర్ణయించిన టిక్కెట్ల ధరతో తాము నడపలేమని యాజమాన్యాల ప్రకటన


దేవరాపల్లి/ఎస్‌.రాయవరం, డిసెంబరు 24: ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో తాము థియేటర్‌లు నడపలేమంటూ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు శుక్రవారం థియేటర్లు మూసివేశారు. వివరాలిలా ఉన్నాయి. దేవరాపల్లిలో మహేశ్వరీ థియేటర్‌ను యాజమాన్యం మూసివేసింది. గురువారం తహసీల్దార్‌ రమేశ్‌బాబు ఈ థియేటర్‌ను తనిఖీ చేశారు. జీవో నంబర్‌ 30 ప్రకారం ‘సీ’ కేటగిరీలో వున్న ఈ థియేటర్‌లో టిక్కెట్‌ ధరలు రూ.5, రూ.10, రూ.20 వుండాలని యాజమాన్యానికి చెప్పారు. అదే రేటుకు విక్రయించాలని, అంతకుమించి అమ్మితే థియేటర్‌ను సీజ్‌ చేస్తామని చెప్పారు. దీంతో ఇరవై ఏళ్ల క్రితం నాటి టిక్కెట్‌ ధరలతో ఇప్పుడు నడపలేమంటూ యాజమాన్యం థియేటర్‌ను మూసివేసింది. అలాగే ఎస్‌.రాయవరంలో బాలత్రిపుర సుందరి థియేటర్‌ను కూడా యజమాని మూసివేశారు. ‘ప్రభుత్వం ఇచ్చిన రేట్లు ప్రకారం థియేటర్‌ను నడపడం మా వల్ల కాదు...కావున తాత్కాలికంగా థియేటర్‌ను మూసివేస్తున్నాం’ అంటూ థియేటర్‌ ముందు బోర్డు పెట్టారు.


కొనసాగిన తనిఖీలు

జిల్లాలో సినిమా థియేటర్ల తనిఖీలు శుక్రవారం కూడా కొనసాగాయి. నగరంలోని జగదాంబ, రమాదేవి, మెలోడి ఽథియేటర్లను స్వయంగా కలెక్టర్‌ డాక్టరు ఎ.మల్లికార్జున తనిఖీ చేశారు. ప్రేక్షకులు, థియేటర్‌ నిర్వాహకులతో మాట్లాడారు. జగదాంబ కాంప్లెక్స్‌లో రమాదేవి థియేటర్‌లో త్రీడీ స్ర్కీన్‌కు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలుసుకుని యజమానికి నోటీస్‌ జారీచేశారు. నిబంధనలు పాటించని థియేటర్లపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ స్పష్టంచేశారు. కలెక్టర్‌ వెంట విశాఖ ఆర్డీవో కె.పెంచల కిషోర్‌, మహారాణిపేట తహసీల్దారు పాల్‌ కిరణ్‌ ఉన్నారు. కాగా జిల్లాలో అన్ని ప్రాంతాల్లో థియేటర్ల తనిఖీలు పూర్తయినట్టు రెవెన్యూ వర్గాలు తెలిపాయి.  ఆర్డ్డీవోల నుంచి సమాచారం వచ్చిన వెంటనే ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని పేర్కొన్నారు. Updated Date - 2021-12-25T06:37:52+05:30 IST