ట్రావెల్స్‌ బస్సు బోల్తా

ABN , First Publish Date - 2021-07-08T05:58:10+05:30 IST

నగర పరిధిలోని ఆటోనగర్‌ ట్రాఫిక్‌ సిగ్నల్‌ పాయింట్‌ వద్ద బుధవారం ఉదయం ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది.

ట్రావెల్స్‌ బస్సు బోల్తా
బోల్తాపడిన ప్రైవేట్‌ బస్సు...పక్కన బొలెరో వాహనం

బొలెరో వాహనాన్ని ఢీకొని ట్రాఫిక్‌ అంబ్రెల్లాపైకి దూసుకుపోయిన వైనం

బస్సులో 30 మంది ప్రయాణికులు

ముగ్గురికి స్వల్పగాయాలు

తప్పిన పెను ప్రమాదం

అపరిమిత వేగమే ప్రమాదానికి కారణం


గాజువాక (విశాఖపట్నం), జూలై 7: నగర పరిధిలోని ఆటోనగర్‌ ట్రాఫిక్‌ సిగ్నల్‌ పాయింట్‌ వద్ద బుధవారం ఉదయం ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. అయితే ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. రజాక్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు నెల్లూరు నుంచి మంగళవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట బయలుదేరింది. బుధవారం ఉదయం ఇక్కడి ఆటోనగర్‌ సర్కిల్‌ వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి...ఐలా వైపు వెళుతున్న బొలెరో వాహనాన్ని ఢీకొని ట్రాఫిక్‌ అంబ్రెల్లాపైకి దూసుకువెళ్లి సర్వీసు రోడ్డులో బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా, మిగిలినవారు సురక్షితంగా బయటపడ్డారు. అంతా వేరే వాహనాల్లో గమ్య స్థానాలకు బయలుదేరివెళ్లారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. ఆ సమయంలో వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిత్యం వాహనాలతో రద్దీగా వుండే ట్రాఫిక్‌ సిగ్నల్‌ పాయింట్‌ వద్ద...ఆ సమయంలో ఒక్క వాహనం కూడా లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. బస్సు బోల్తాపడిన సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ సీఐ బీఎండీ ప్రసాద్‌, ఎస్‌ఐలు అక్కడకు చేరుకొని ట్రాఫిక్‌పరమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. సర్వీసురోడ్డుకు అడ్డంగా వున్న బస్సును, బొలెరో వ్యాన్‌లను క్రేన్‌ల సహాయంతో బయటకు తీశారు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్‌ అంబ్రెల్లా


అపరిమిత వేగంతో దూసుకువెళుతున్న బస్సు బొలెరోతో పాటు ట్రాఫిక్‌ అంబ్రెల్లాను ఢీకొని పక్కనే వున్న సర్వీసు రోడ్డులో బోల్తాపడింది. ఆ సర్వీసు రోడ్డుకు ఆనుకొని గెడ్డ ఉంది. అక్కడ ట్రాఫిక్‌ అంబ్రెల్లా లేనట్టయితే బస్సు డ్రైనేజీలో పడి ఉండేదంటున్నారు. అదే జరిగితే ప్రాణ నష్టం వాటిల్లి ఉండేదని, అంబ్రెల్లా వల్ల ప్రమాద తీవ్రత తగ్గిందని సీఐ ప్రసాద్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2021-07-08T05:58:10+05:30 IST