పర్యాటక ప్రాంతాలు కిటకిట
ABN , First Publish Date - 2021-11-22T04:58:35+05:30 IST
నగర పరిధిలోని పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో ఆదివారం కిటకిటలాడాయి. కార్తీకమాసం మూడో ఆదివారం కావడంతో నగరం, జిల్లా నుంచే కాకుండా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వందల మంది సందర్శకులు తరలివచ్చారు.

సందర్శకులతో సందడి
విశాఖపట్నం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : నగర పరిధిలోని పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో ఆదివారం కిటకిటలాడాయి. కార్తీకమాసం మూడో ఆదివారం కావడంతో నగరం, జిల్లా నుంచే కాకుండా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వందల మంది సందర్శకులు తరలివచ్చారు. నగర పరిధిలోని ఆర్కే బీచ్, వుడా పార్క్, కైలాసగిరి, తెన్నేటి పార్క్, జూ పార్క్‌కు సందర్శకుల తాకిడి భారీగా పెరిగింది. కుటుంబ సమేతంగా, స్నేహితులతో కలిసి తరలివచ్చారు. జూ పార్క్‌లో చిన్నారులు, పెద్దలు అన్న తేడా లేకుండా సందడి చేస్తూ కనిపించారు. బంధువులు, స్నేహితులతో కలిసి ప్రత్యేక వాహనాల్లో ఎక్కువ మంది తరలివచ్చారు. జూలోని జంతువులను చూసిన అనంతరం అంతా కలిసి సహపంక్తి భోజనాలు చేసి ఎంజాయ్ చేశారు. అనంతరం పలు ఆటలాడుతూ సందడి చేస్తూ కనిపించారు. కైలాసగిరికి సందర్శకుల తాకిడి భారీగా కనిపించింది. కైలాసగిరి ఫొటో వ్యూ పాయింట్ వద్ద ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. అదే విధంగా తెన్నేటి పార్క్ వద్దనున్న నౌకను చూసేందుకు భారీతా తరలివచ్చారు. ఆర్కే బీచ్‌కు సందర్శకులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బీచ్‌లో సందర్శకులు స్నానాలు చేస్తూ, ఫొటోలు దిగుతూ కనిపించారు.