టోల్‌గేటు...చార్జీల పోటు!

ABN , First Publish Date - 2021-12-19T06:02:44+05:30 IST

అనకాపల్లి నుంచి సబ్బవరం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, తదితర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు భారం పడింది. ఒకటి, రెండు కాదు...ఏకంగా రూ.10 చార్జి పెరిగింది. ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచలేదు కదా! అదనంగా ఈ బాదుడేంటి? అని ఆశ్చర్యపోతున్నారా...

టోల్‌గేటు...చార్జీల పోటు!

ఆర్టీసీ ప్రయాణికులపై బాదుడు

రోడ్డు నిర్మాణం పూర్తికాకముందే టోల్‌ప్లాజా

అనకాపల్లి-విజయనగరం మార్గంలో ఏర్పాటు

సబ్బవరం దాటితే రూ.10 అదనపు చార్జి


అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 18: అనకాపల్లి నుంచి సబ్బవరం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, తదితర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు భారం పడింది. ఒకటి, రెండు కాదు...ఏకంగా రూ.10 చార్జి పెరిగింది. ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచలేదు కదా! అదనంగా ఈ బాదుడేంటి? అని ఆశ్చర్యపోతున్నారా...

అనకాపల్లి నుంచి ఆనందపురం వరకూ ఆరు లేన్ల రహదారి నిర్మాణం జరుగుతోంది. ఈ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కోడూరు పంచాయతీ పరిధిలోని మర్రిపాలెం సమీపంలో శుక్రవారం టోల్‌గేటు ఏర్పాటుచేసేశారు. వాహన చోదకులతో పాటు ఆర్టీసీ ప్రయాణికులపై బాదుడు మొదలెట్టారు. 

చార్జీల పెంపు ఇలా...

అనకాపల్లి నుంచి సబ్బవరానికి ఇప్పటివరకు రూ.20 వసూలు చేస్తున్నారు. టోల్‌గేటు ఏర్పాటుతో శుక్రవారం నుంచి ఈ చార్జీ రూ.25కు పెరిగింది. ఇది కూడా కేవలం సబ్బవరం స్టేజీ వరకు మాత్రమే. ఆ తరువాత స్టేజీ నుంచి కనీసం రూ.10 అదనంగా పెరిగింది. అనకాపల్లి నుంచి పెందుర్తి చార్జీ గతంలో రూ.25 ఉండేది. ఇప్పుడు రూ.35కు పెరిగింది. అలాగే అనకాపల్లి-కొత్తవలస చార్జీని రూ.30 నుంచి 40కు, అలమండకు రూ.35 నుంచి రూ.45కు, భీమసింగికి రూ.45 నుంచి రూ.55కు, విజయనగరానికి ప్రస్తుతం వున్న రూ.60 నుంచి రూ.70 టిక్కెట్‌ ధర పెరిగింది. ఏదేమైనా రహదారి నిర్మాణం పూర్తికాకముందే టోల్‌గేటు ఏర్పాటుచేసి ఫీజు వసూలు చేయడంపై ఆర్టీసీ ప్రయాణికులు, వాహన చోదకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - 2021-12-19T06:02:44+05:30 IST