చెరువులవేనం సందర్శనకు టిక్కెట్‌ తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-08-20T05:45:09+05:30 IST

ఆంధ్రకశ్మీర్‌ లంబసింగి సమీపంలో ఉన్న చెరువులవేనం సందర్శించే పర్యాటకులు ఇక మీదట టెక్కెట్‌ తీసుకోవాల్సిందేనని పాడేరు డీఎల్‌పీవో పీఎస్‌ కుమార్‌ ప్రకటించారు.

చెరువులవేనం సందర్శనకు టిక్కెట్‌ తీసుకోవాలి
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న డీఎల్‌పీవో పీఎస్‌ కుమార్‌పాడేరు డీఎల్‌పీవో పీఎస్‌ కుమార్‌

చింతపల్లి, ఆగస్టు 19: ఆంధ్రకశ్మీర్‌ లంబసింగి సమీపంలో ఉన్న చెరువులవేనం సందర్శించే పర్యాటకులు ఇక మీదట టెక్కెట్‌ తీసుకోవాల్సిందేనని పాడేరు డీఎల్‌పీవో పీఎస్‌ కుమార్‌ ప్రకటించారు. గురువారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో లంబసింగి పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్‌, వ్యర్థాల నియంత్రణ, పర్యాటక అభివృద్ధిపై డీఎల్‌పీవో సమీక్షించారు. లంబసింగి సర్పంచ్‌, చెరువులవేనం గిరిజనులతో డీఎల్‌పీవో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, చెరువులవేనం మంచు అందాలను అస్వాదించేందుకు నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుందన్నారు. ఈ సమయంలో ఆదివాసీ రైతుల పంటలకు నష్టం కలుగుతుందని, అలాగే జనావాసాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు పెరిగిపోతున్నారన్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించడంతోపాటు సందర్శక ప్రాంతాలను శుభ్రం చేసేందుకు చెరువులవేనం గ్రామానికి చెందిన 23 మంది గిరిజనులు ముందుకొచ్చి ‘ఓజమనే సంఘం’గా ఏర్పడ్డారన్నారు. ఈ మేరకు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ ఆదేశాల మేరకు ఓజమనే సంఘం సభ్యులు, లంబసింగి పంచాయతీ సంయుక్తంగా సందర్శకుల నుంచి టెక్కెట్‌ రూపంలో కొంత నగదుని వసూలు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ నిధులను చెరువులవేనం అభివృద్ధి, పారిశుధ్యం మెరుగుకు వ్యయం చేస్తామన్నారు. అలాగే బీమనాపల్లి గ్రామం వద్ద పార్కింగ్‌ సదుపాయం కల్పించి టిక్కెట్‌ వసూలు చేస్తామన్నారు. ఈ నిధుల్లో ఓజమనే సంఘానికి 65 శాతం, పంచాయతీకి 35 శాతం చెల్లించడం జరుగుతుందన్నారు. చెరువులవేనంకి ఉపాధి హామీలో రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామన్నారు. గ్రామంలో తాగునీటి సదుపాయం కల్పించేందుకు పంచాయతీ నిధులు కేటాయించినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో లాలం సీతయ్య, ఈవోపీఆర్‌డీ శ్రీనివాసరావు, సర్పంచ్‌ కొర్ర శాంతి కుమారి, వైసీపీ నాయకుడు రఘునాథ్‌, కార్యదర్శి గోవింద్‌, ఓజమనే సంఘం సభ్యులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-08-20T05:45:09+05:30 IST