ఏ తప్పు చేశామని నిందలు వేస్తున్నారు..

ABN , First Publish Date - 2021-11-26T06:23:29+05:30 IST

ఉపాధి పనులు చేసుకున్న అనంతరం జీడిపిక్కల కర్మాగానికి వెళ్లడం తప్పా..? దీనికి మాపై నిందలు వేయడమేమిటని ఫీల్డ్‌ అసిసెంట్‌కు విచారణకు వచ్చిన అధికారులను మహిళలు నిలదీశారు.

ఏ తప్పు చేశామని నిందలు వేస్తున్నారు..
అధికారులతో వాగ్వాదం చేస్తున్న మహిళలు, గ్రామస్థులు

అధికారులను నిలదీసిన మహిళలు

ఫీల్డ్‌ అసిస్టెంట్‌ అక్రమాలపై విచారణ


రోలుగుంట, నవంబరు 25: ఉపాధి పనులు చేసుకున్న అనంతరం జీడిపిక్కల కర్మాగానికి వెళ్లడం తప్పా..? దీనికి మాపై నిందలు వేయడమేమిటని ఫీల్డ్‌ అసిసెంట్‌కు విచారణకు వచ్చిన అధికారులను మహిళలు నిలదీశారు. నిండుగొండలో ఉపాధి నిధులు స్వాహా, గ్రూపులకు సంబంధించి పనికోసం డిమాండ్‌ పెట్టడానికి కమీషన్‌ తీసుకోవడం, పనిలోకి రాకపోయినా దొంగ మస్తర్లు వేయడం, జీడిపిక్కల కర్మాగారంలో పనిచేస్తూ ఉపాధి పనులకు వెళ్లడం ఒకేసారి జరగడం తదితర ఆరోపణలపై ఫీల్డ్‌ అసిస్టెంట్‌ చుక్కా శివపై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణల మేరకు డ్వామా అధికారులకు గురువారం విచారణ చేపట్టారు. ఎంపీడీవో కె.ప్రభాకర్‌రావు, ఏపీవో సూర్యమణి, కార్యదర్శి చిరంజీవి, గ్రామస్థుల సమక్షంలో జరిగిన ఈ విచారణలో కొవ్వూరు జీడిపిక్కల కర్మాగారంలో పనిచేస్తున్న మహిళలను ప్రశ్నించారు. కరోనా సమయంలో పనులు లేక ఉదయం గ్రామంలో పదిన్నర వరకు ఉపాధి పనులు చేసుకున్నామని, అనంతరం జీడిపిక్కల కర్మాగారానికి వెళ్లామని, చేసిన పనికే డబ్బులు తీసుకున్నామని మహిళలు తెలిపారు. దీన్ని తప్పుగా చూపించడం సరికాదని అధికారులను నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగి పేరుపై మస్తర్‌ నమోదు చేసినట్టు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను ప్రశ్నించగా, వారి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించామని,  ఆ పనికే మస్తర్‌ వేశామని బదులిచ్చారు. ఆరోపణలపై ఆధారాలు చూపాలని సర్పంచ్‌ను అడగగా, పది రోజులు గడువు కావాలని కోరారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు పంపించి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో కె.ప్రభాకర్‌రావు తెలిపారు.


Updated Date - 2021-11-26T06:23:29+05:30 IST