ఉక్కు కార్మికులదే అంతిమ విజయం
ABN , First Publish Date - 2021-12-31T06:12:19+05:30 IST
అలుపెరుగని సమైఖ్య పోరాటాలతోనే ఉక్కు కార్మికులకు అంతిమ విజయం సిద్ధిస్తుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్ అన్నారు.

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్
కూర్మన్నపాలెం, డిసెంబరు 30: అలుపెరుగని సమైఖ్య పోరాటాలతోనే ఉక్కు కార్మికులకు అంతిమ విజయం సిద్ధిస్తుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్ అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 322వ రోజుకు చేరుకోగా, ఇందులో ఎల్‌ఎంఎంఎం,డబ్ల్యూఆర్‌ఎం-1, ఆర్‌ఎస్ అండ్ ఆర్‌ఎస్‌కు చెందిన కార్మికులు కూర్చున్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారన్నారు. ప్రజారంజక పాలనను అందించే ప్రభుత్వాలకు ప్రజలు మద్దతుగా నిలుస్తారని, ప్రజా వ్యతిరేక పాలనకు సిద్ధపడితే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కమిటీ కో-కన్వీనర్ గంధం వెంకటరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారంపై జరుగుతున్న దుష్ప్రచారాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉక్కు ఉద్యోగుల భుజస్కందాలపై ఉందన్నారు. ప్రజా పోరాటాలతో ఉక్కు పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. కమిటీ నాయకుడు కేఎస్‌ఎన్ రావు మాట్లాడుతూ పీఎం మోదీ ప్రభుత్వ రంగాన్ని మరింత బలహీన పరుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అయోధ్యరామ్, ఎన్.రామారావు, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్, జి.ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.