ఉక్కు ఉద్యమం ఉధృతం

ABN , First Publish Date - 2021-02-26T05:47:51+05:30 IST

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ అడుగులు వేస్తోంది.

ఉక్కు ఉద్యమం ఉధృతం

నేడు రాస్తారోకోకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు

ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రహదారులు దిగ్బంధం

మద్దతు ప్రకటించిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు


విశాఖపట్నం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి):


స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ గత నెల రోజులుగా రాజకీయ పార్టీలు, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకువెళుతోంది. తాజాగా ‘ఇంటర్‌ గ్రూప్‌ ఆఫ్‌ మినిస్ట్రీస్‌ ఆన్‌ స్ట్రాటజిక్‌ సేల్‌ ఆఫ్‌ విశాఖ స్టీల్‌ప్లాంట్‌’ పేరుతో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ స్టీల్‌ప్లాంట్‌ను ఏ విధంగా, ఎంత మొత్తానికి విక్రయించాలి...వంటి అంశాలపై అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఈ పరిణామంపై ఉద్యోగ, కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత నెల రోజులుగా ప్రజా జీవనానికి ఇబ్బందుల్లేకుండా శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి పట్టడం లేదని, అందుకే రోడ్డెక్కాలని నిర్ణయానికి వచ్చామని కమిటీ ప్రతినిధులు చెబుతున్నారు. కమిటీ ఇచ్చిన పిలుపునకు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలతోపాటు అన్ని కార్మిక, ఉద్యోగ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రోడ్లను దిగ్బంధించనున్నట్టు ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ అయోధ్యరామ్‌ ప్రకటించారు. రెండు గంటలపాటు రోడ్లపై నిరసన తెలియజేసి...ప్రైవేటీకరణ నిర్ణయంపై తమ వ్యతిరేకతను తెలియజేయనున్నట్టు  చెప్పారు. త్యాగాల ఫలితంగా ఏర్పడిన, ఆంధ్రుల ఆత్మాభిమానానికి ప్రతీక అయిన స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకునేందుకు చేపట్టిన ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, రాస్తారోకోకు మద్దతు పలకాలని ఆయన పిలుపునిచ్చారు. నగర పరిధిలోని కూర్మన్నపాలెం జంక్షన్‌తోపాటు గాజువాక, మద్దిలపాలెం, ఇసుకతోట, ఆర్టీసీ కాంప్లెక్స్‌ తదితర ప్రాంతాల్లో రాస్తారోకో నిర్వహించనున్నట్టు తెలియజేశారు.


నేడే భారత్‌ బంద్‌.. 


పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు నిరసనగా  అఖిల భారత మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ పిలుపు


దేశంలో కొద్దినెలలుగా పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నిరసిస్తూ అఖిల భారత మోటార్‌ ట్రాన్సుపోర్ట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ శుక్రవారం భారత్‌బంద్‌కు పిలుపునిచ్చింది. ఉదయం 10.30 గంటల నుంచి ఎక్కడికక్కడే లారీలను నిలిపివేయనున్నట్టు అసోసియేషన్‌ జాతీయ ఉపాధ్యక్షుడు జానకిరామయ్య తెలిపారు. బంద్‌కు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మద్దతు ప్రకటించినట్టు ఆయన వెల్లడించారు. మందులు, కూరగాయల వాహనాలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని, మిగిలిన వాటిని పూర్తిగా నిలిపివేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచడం దుర్మార్గమని, తక్షణమే తగ్గించాలని ఆయన డిమాండ్‌ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 75 నెలల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, దీనివల్ల రవాణా రంగంపై తీవ్ర భారం పడుతోందన్నారు. పెరిగిన ధరలు తమతోపాటు సాధారణ ప్రజలకు పెనుభారంగా మారాయన్నారు. బంద్‌కు ప్రతి ఒక్కరూ మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తిచేశారు. 

Updated Date - 2021-02-26T05:47:51+05:30 IST