రెండు గంటలు కుండపోత

ABN , First Publish Date - 2021-05-22T04:44:32+05:30 IST

వాతావరణంలో మార్పుల కారణంగా మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది.

రెండు గంటలు కుండపోత
గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో వర్షం కురుస్తున్న దృశ్యం

  

 ఉదయం నుంచి భానుడు భగభగ

 మధ్యాహ్నం మూడు గంటల నుంచి మారిన వాతావరణం

  ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో పలుచోట్ల భారీ వర్షం

  పిడుగుపాటుకు మాకవరపాలెం మండలం జి.గంగవరంలో గేదె, పెయ్యి మృతి 

గొలుగొండ/ కృష్ణాదేవిపేట : వాతావరణంలో మార్పుల కారణంగా మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. రెండు గంటల పాటు ఏకధాటిగా పడిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. ఉదయం నుంచి ఎండ మండినప్పటికీ మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఆకాశంలో మేఘాలు కమ్ముకుని గాలులతో వర్షం ప్రారంభమైంది. దీంతో గొలుగొండ, పాతమల్లంపేట, లింగపేట, కొత్తపాలెం, చీడిగుమ్మల, గుండుపాల, ఏఎల్‌పురం, కొంగశింగి, పాతకృష్ణాదేవిపేట, చీడిగుమ్మల, చోద్యం తదితర గ్రామాలు తడిసి ముద్దయ్యాయి.  మెరక దుక్కులకు, వరినారుమడులు సిద్ధం చేసుకునేందుకు ఈ వర్షం ఎంతగానో ఉపయోగ పడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

మాకవరపాలెంలో... 

మాకవరపాలెం : మండలంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రంగానే ఉన్నప్పటికీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి గంటన్నర పాటు కుండపోతగా వాన పడిది. ఇదిలావుంటే,               జి.గంగవరంలో శుక్రవారం మధ్యాహ్నం పిడుగు పడి పాడి గేదెతో పాటు  ఓ దూడ మృతి చెందింది.  గ్రామానికి చెందిన చిటికల గోవింద తన గేదెను మేతకు విప్పి, వర్షం వచ్చే సూచనలు కనిపించడంతో గేదెతో పాటు పెయ్యిని పాకలో కట్టి ఇంటికి వెళ్లాడు. వర్షం కురుస్తుండగానే పాకపై పిడుగు పడడంతో రూ.70 వేలు విలువ చేసే గేదె, పెయ్యి మృత్యువాత పడ్డాయి. దీంతో ఆ రైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. అలాగే, శ్రీరామపురంలో పిడుగుపాటుకు పలువురి ఇళ్లలోని టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోయినట్టు స్థానికులు తెలిపారు. 

పాయకరావుపేటలో..

పాయకరావుపేట : గత కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పాయకరావుపేట మండలంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు అర్ధ గంటపాటు  పడిన వర్షానికి   లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, కాలువల్లోని మురుగు వర్షపునీటితో కలిసి రోడ్లపై ప్రవహించింది. మధ్యాహ్నం నుంచి కర్ఫ్యూ అమలుతో ఇళ్ల వద్ద ఉన్న జనం ఉష్ణతాపానికి ఉక్కిరి బిక్కిరయ్యారు. సాయంత్రం పడిన వర్షానికి వాతావరణం చల్లబడడంతో అంతా సేదదీరారు. 

కోటవురట్లలో...

కోటవురట్ల : మండలంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. సుమారు గంటపాటు పడడంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. కాలువల్లో చెత్తాచెదారం పలుచోట్ల రోడ్లపైకి చేరింది. గాలులకు మామిడి కాయలు రాలిపోవడంతో ఆయా రైతులు నష్టపోయారు.

ఎలమంచిలిలో ....

ఎలమంచిలి : మండల కేంద్రం ఎలమంచిలితో పాటు పరిసర గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి భానుడి ప్రతాపానికి జనం ఇంటి నుంచి బయటకు రాలేకపోయారు. ఈదురు గాలులతో వర్షం పడడంతో మామిడి కాయలు నేలరాలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2021-05-22T04:44:32+05:30 IST