ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే మా కుమార్తెను బలిగొంది..
ABN , First Publish Date - 2021-12-09T05:54:27+05:30 IST
పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిందని, తమకు న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మండల విద్యాశాఖాఽధికారి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

న్యాయం చేయాలంటూ ఎంఈవోను వేడుకున్న మృతి చెందిన విద్యార్థిని తల్లిదండ్రులు
ఉపాధ్యాయురాలు సస్పెన్షన్
పెందుర్తి, డిసెంబరు 8: పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిందని, తమకు న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మండల విద్యాశాఖాధికారి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పాత పెందుర్తిలోని ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న భావన (7) మంగళవారం స్కూల్ నుంచి బయటకు వచ్చినప్పుడు లారీ ఢీకొని మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఎంఈవో సునీత బుధవారం పాఠశాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు ఈ సందర్భంగా బాలిక కుటుంబ సభ్యులు ఎంఈవోను కలిసి తమ గోడును వివరించి కన్నీటిపర్యంతమయ్యారు. బాలిక తల్లి వరలక్ష్మి మాట్లాడుతూ తాను ఇదే పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం వంటకు సహాయకురాలిగా పనిచేస్తున్నట్టు తెలిపింది. సహచర విద్యార్థిని వాష్‌రూమ్‌కి వెళతానంటే తోడుగా తన కుమారై భావనను ఉపాధ్యాయురాలు బయటకు పంపారని, వారు తిరిగి పాఠశాలకు వస్తుండగా తమ కుమార్తెను లారీ ఢీకొనడంతో మృతి చెందిందన్నారు. పాఠశాలలోని బాత్‌రూమ్‌లను విద్యార్థులు వినియోగించకుండా ఉపాధ్యాయులు కట్టడి చేస్తున్నారని, అదే తమ కుమార్తెను బలిగొందన్నారు. 96వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు బాలిక మృతికి పాఠశాల ఉపాధ్యాయుల తప్పిదమే కారణమని వివరించారు.
ఉపాధ్యాయురాలు సస్పెన్షన్
పాఠశాల విద్యార్థిని భావన మృతికి సంబంధించిన నివేదికను జిల్లా విద్యాశాఖాధికారికి నివేదించామని ఎంఈవో సునీత తెలిపారు. డీఈవో ఆదేశాలల మేరకు ఉపాధ్యాయురాలు ఉషారాణిని సస్పెండ్ చేశామన్నారు. మండల విద్యాశాఖ పరిధిలోని పాఠశాలల విద్యార్థుల భద్రతకు తగిన చర్యలు చేపడుతున్నామని ఆమె పేర్కొన్నారు.