రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్రం

ABN , First Publish Date - 2021-11-28T06:07:38+05:30 IST

రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వైసీపీ, టీడీపీ, జనసేనలు ఉదాసీన వైఖరిని విడనాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్రం
విలేఖరులతో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు


సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు 

పాడేరు, నవంబరు 27: రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వైసీపీ, టీడీపీ, జనసేనలు ఉదాసీన వైఖరిని విడనాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. సీపీఎం జిల్లా మహాసభల్లో పాల్గొనేందుకు విచ్చే సిన ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. విభజన హామీలను అమలు చేయకపోగా కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాల కోసం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందన్నారు. అటువంటి బీజేపీని టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు బలపరుస్తున్నాయని మధు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌ ఏర్పాటు వంటివి కేంద్రం నిర్లక్ష్యం కారణంగానే కార్యరూపం దాల్చలేదన్నారు. గిరిజన చట్టాల సవరణకు వ్యతిరేకంగా ఏజెన్సీలో పాదయాత్ర నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. అలాగే జీవో-3 రద్దుతో గిరిజనులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మైనింగ్‌ చట్టాలను సవరించి బాక్సైట్‌ను తరలించేందుకు మోదీ చేస్తున్న యత్నాలను తిప్పికొడతామన్నారు. గిరిజన ప్రాంతంలో భూములు అన్యాక్రాంతం కాకుండా అటవీ హక్కుల చట్టంలో భాగంగా సాగు భూములకు హక్కులు కల్పించేలా పోరాడతామన్నారు. అలాగే విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బలమైన పోరాటాలు నిర్వహించి, దానిని కాపాడుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు స్పష్టంచేశారు. విలేఖరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి లోకనాథం, మండల కార్యదర్శి ఎల్‌.సుందరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-28T06:07:38+05:30 IST