కరోనా సమయంలో ప్రజలపై భారం తగదు

ABN , First Publish Date - 2021-06-22T05:53:27+05:30 IST

ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన కరోనా సమయంలో ప్రజలపై పన్నుల భారం మోపడం తగదని జీవీఎంసీలోని విపక్షాల ఫ్లోర్‌ లీడర్లు జీవీఎంసీ మేయర్‌ జీహెచ్‌వీ కుమారి, కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజనలకు విజ్ఞప్తి చేశారు.

కరోనా సమయంలో ప్రజలపై భారం తగదు
మేయర్‌కు వినతిపత్రం అందజేస్తున్న జీవీఎంసీలోని విపక్షాల ఫ్లోర్‌ లీడర్లు

జీవీఎంసీ మేయర్‌, కమిషనర్లకు విపక్షాల వినతి

విశాఖపట్నం, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన కరోనా సమయంలో ప్రజలపై పన్నుల భారం మోపడం తగదని జీవీఎంసీలోని విపక్షాల ఫ్లోర్‌ లీడర్లు జీవీఎంసీ మేయర్‌ జీహెచ్‌వీ కుమారి, కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజనలకు విజ్ఞప్తి చేశారు. ఆస్తి మూలవిలువ ఆధారంగా ఆస్తిపన్ను విధింపు కోసం జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌ను రద్దు చేయడంతోపాటు, చెత్తపై పన్ను నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ సోమవారం జీవీఎంసీ కార్యాలయంలో వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి, 78వ వార్డు కార్పొరేటర్‌ బి.గంగారావు మాట్లాడుతూ జీవీఎంసీ కౌన్సిల్‌లో సభ్యుడుగానీ, ప్రజాప్రతినిధి కూడా కానీ కేకేరాజు ప్రతిపాదించిన పనులను అజెండాలో ఎలా పేర్కొంటారంటూ కమిషనర్‌ను ప్రశ్నించారు. కౌన్సిల్‌ ఉన్నప్పటికీ ఎలాంటి సమాచారం లేకుండా ఆస్తిపన్ను పెంపు ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కిందకే వస్తుందని, దీనిపై కౌన్సిల్‌లో చర్చ పెట్టాలని టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాస్‌, జనసేన ఫ్లోర్‌ లీడర్‌ పీతల మూర్తియాదవ్‌ కోరారు. 


Updated Date - 2021-06-22T05:53:27+05:30 IST