కెరటాల కాటుకు బాలుడు మృతి

ABN , First Publish Date - 2021-10-07T05:41:56+05:30 IST

అన్నయ్యతో కలిసి సరదాగా సముద్ర స్నానాలకు వెళ్లి కెరటాల కాటుకు ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన బుధవారం సాగర్‌నగర్‌ తీరంలో చోటుచేసుకుంది.

కెరటాల కాటుకు బాలుడు మృతి
ప్రసాద్‌ మృతదేహం

సాగర్‌నగర్‌, అక్టోబరు 6: అన్నయ్యతో కలిసి సరదాగా సముద్ర స్నానాలకు వెళ్లి కెరటాల కాటుకు ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన బుధవారం సాగర్‌నగర్‌ తీరంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఎండాడ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న రోకల్ల ప్రసాద్‌ (8) ఏడో తరగతి  చదువుతున్న తన అన్నయ్య మాధవ్‌, మరో ఏడుగురితో కలిసి సాగర్‌నగర్‌ సమీపంలోని మోగధారమ్మ అమ్మవారి గుడి ఎదురుగా ఉన్న సముద్ర తీరంలో  స్నానాలకు దిగారు. వీరంతా స్నానాలు చేస్తుండగా ఒక్కసారిగా ప్రసాద్‌ కెరటాల ధాటికి సముద్రంలోకి కొట్టుకుపోయి కాసేపటికే విగతజీవుడై ఒడ్టుకు కొట్టుకువచ్చాడు. ఆరిలోవ పోలీసులు ప్రసాద్‌ను గీతం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కళ్లెదుటే తమ్ముడు మృతి చెందడంతో మాధవ్‌ కన్నీరుమున్నీరుగా విలపించాడు. కాగా బాలుడి తల్లిదండ్రులు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ ఎండాడ రెడ్డీలకాలనీలో నివాసం ఉంటున్నారు.


Updated Date - 2021-10-07T05:41:56+05:30 IST